Mahatma Gandhi : మహాత్మా గాంధీ మెచ్చిన నాయకులు వీళ్లే

Mahatma Gandhi :  మహాత్మా గాంధీ మెచ్చిన నాయకులు వీళ్లే


ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ. భారతీయులకు ఆయన మహాత్ముడు, జాతిపిత, స్ఫూర్తిప్రదాత. కులమతాలు, ఆచారవ్యవహారాలు, భాషాభేదాలు.. అన్నింటినీ మరిచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం కోట్లాది ప్రజలు ఒక్కతాటిపై నడిచేలా చేసిన వ్యక్తి. ముందుండి నడిపించిన శక్తి. దానికోసం ఆయన పడిన కష్టాలు, పాటించిన విలువలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి మహనీయుడి 154వ జయంతి నేడు. 

మహాత్మా గాంధీ మెచ్చిన నాయకులు

గాంధీజీ సిద్ధాంతాలు, ఆదర్శాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన్ని అభిమానించేవాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. వాళ్లలో మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్(అమెరికా)​, నెల్సన్​మండేలా(దక్షిణాఫ్రికా), కొరియన్​ గాంధీగా పేరు పొందిన చొ మన్​–సిక్​(దక్షిణకొరియా), హో చి మిన్​(వియత్నాం) మొదలుకొని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా వరకు ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వీళ్లు అంతలా గాంధీజీని అభిమానించడానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. అయితే, గాంధీజీ గొప్ప వ్యక్తిగా మారడం వెనక కొంతమంది ఉన్నారు. వాళ్లే హెన్రీ డేవిడ్​ థియరూ(అమెరికా), జాన్​ రస్కిన్(బ్రిటన్​)​, లియో టాల్​స్టాయ్(రష్యా)​, సోక్రటీస్(గ్రీస్​)​, రాల్ఫ్​ వాల్దో ఎమర్సన్(అమెరికా)​. 

హెన్రీ డేవిడ్​ థియరూ: ఈయన రాసిన ‘ఆన్​ ది డ్యూటీ ఆఫ్​ సివిల్​ డిస్​ఒబీడియన్స్’ వ్యాసం చదివి ఎంతో ఇన్​స్పైర్​ అయినట్లు గాంధీ చెప్పుకున్నారు. ‘అన్యాయమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటే అదే అక్కడి ప్రజలకు జైలు లాంటిద’ని ఆ వ్యాసంలో​ థియరూ అన్నారు. దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ‘శాసనోల్లంఘన’ తప్పదన్నారు. ఆ మాటలు గాంధీజీని ప్రభావితం చేశాయి. ఇవే సత్యాగ్రహానికి స్ఫూర్తి.

జాన్​ రస్కిన్​:  ఈయన రాసిన ‘అన్​ టు దిస్​ లాండ్​’ పుస్తకం గాంధీని ఎంతో ప్రభావితం చేసింది. ‘శారీరక శ్రమ అన్నిటికంటే గొప్పదని, మేధావి వర్గం కన్నా శారీరక శ్రమ చేసేవాళ్ళు గొప్పోళ్ల’ని ఆ పుస్తకంలో చెప్పిన విషయం గాంధీజీని ఇన్​స్పైర్​ చేసింది. సమాజంలోని ప్రతి ఒక్కరికీ అన్ని ప్రయోజనాలు కలగాలంటూ గాంధీజీ చెప్పిన ‘సర్వోదయ’ సూత్రానికి కారణం అదే. 

Also Read :- మహాత్మా గాంధీ ఆదర్శంతోనే తెలంగాణలో కేసీఆర్ పాలన

లియో టాల్​స్టాయ్​:  గాంధీజీ జీవితాంతం అహింసను పాటించడం వెనక ఉన్నది లియో టాల్​స్టాయ్​. ఈయన రాసిన ‘ది కింగ్​డమ్​ ఆఫ్​ గాడ్​ వితిన్​ యు’ పుస్తకం తనను ఎంతో ఇన్​స్పైర్​ చేసిందని స్వయంగా గాంధీజీనే చెప్పారు. ఆ పుస్తకంలోని ‘లవ్​ యాజ్​ లా ఆఫ్​ లైఫ్​(ప్రేమే జీవిత సూత్రం)’ అనే మాటలు తనమీద ప్రభావం చూపాయన్నారు. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఉత్తరాల ద్వారా మాటలు నడిచాయి. 

సోక్రటీస్​: ఈయన గొప్ప గ్రీక్​ ఫిలాసఫర్. ‘నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా ఎదిరించి నిలబడు’ అనే సూత్రాన్ని సోక్రటీస్​ జీవితం నుంచే గాంధీజీ తీసుకున్నారు. సత్యాగ్రహాన్ని కట్టుతప్పకుండా పాటించడం వెనక సోక్రటీస్​ చెప్పిన అపాలజీ(గ్రీక్​ భాషలో ఎదురించు’ అనే మాటలు ఉన్నాయని గాంధీజీ ఎన్నోసార్లు చెప్పారు.

రాల్ఫ్​ వాల్దో ఎమర్సన్​: ఈయన అమెరికన్​ రచయిత. పట్టణీకరణను తీవ్రంగా వ్యతిరేకించే గాంధీజీ.. పల్లెలు స్వయంసమృద్ధి సాధించాలని తరచూ చెప్పేవారు. గ్రామాల అభివృద్ధికి ఆలోచించేవారు. దీని వెనక రాల్ఫ్​ వాల్దో ఎమర్సన్​ రాసిన పుస్తకాలు ఉన్నాయి. లా చదువుతున్నప్పుడు ఇంగ్లండ్​లో ఉండగా ఎమర్సన్​ పుస్తకాలను చదివారు గాంధీజీ. అప్పుడే ఆయనకు మనదేశంలోని గ్రామాల అభివృద్ధిపై ఒక అభిప్రాయం ఏర్పడింది.