
భారత చరిత్రలో మహాత్మా గాంధీ స్థానం అజరామరం. ఆయన కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాదు, సమాజాన్ని లోతైన మూలాల నుంచి మార్చడానికి కృషి చేసిన మహనీయుడు. ఆయన చూపిన మార్గం కేవలం ఒక కాలానికి మాత్రమే పరిమితం కాలేదు. నేటి తరానికి, రాబోయే తరాలకు కూడా మార్గదర్శనం చేస్తోంది. అహింస, సత్యం, స్వదేశీ, సమానత్వం, గ్రామ స్వరాజ్యం ఇవన్నీ గాంధీ సమాజానికి అందించిన శాశ్వత బోధనలు. గాంధీ.. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జాతి, వర్గ భేదాలు ఉన్న భారతదేశంలో ఒక ఏకత్వాన్ని సృష్టించారు. వర్గం, మతం, భాష వేరు ఉన్నా ప్రజలలో ఐక్యతను పెంపొందించారు.
ప్రతి భారతీయ హృదయాన్ని గాంధీజీ గెలుచుకున్నారు. దీనికి ఆయన అవలంబించిన సాధారణ జీవన విధానం కారణంగా చెప్పవచ్చు. సులభమైన దుస్తులు, సాధారణ ఆహారం,ఈ అంశాలు ఆయన దృఢమైన వ్యక్తిత్వాన్ని చూపాయి. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఆదర్శ వ్యక్తిత్వంగా ఆయన ప్రతి భారతీయుడికి మార్గదర్శకుడు అయ్యారు. సత్యం కోసం ఆయన జైలు జీవితాన్ని ఎదుర్కొన్నా, నిఖార్సయిన విధానం నేటి సమాజానికి ఆదర్శప్రాయం.
‘భారతదేశం ఆత్మ గ్రామాలలో ఉంది’ అని గాంధీ ఇచ్చిన పిలుపు నేటికీ మార్మోగుతున్న నినాదం. స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా, ఒక సమగ్ర సామాజిక సంస్కర్తగా గాంధీజీ దేశానికి చూపిన దారి గ్రామాలపై ఆధారపడింది. ఆయన దృష్టిలో భారత అభివృద్ధి పట్టణాల కాంక్రీట్ భవనాల్లో కాదు, గుడిసెల్లోని స్వరాజ్య భావనలో ఉంది. గాంధీజీ స్వరాజ్యం కేవలం రాజకీయ స్వాతంత్ర్యంతో సరిపోలేదు. ఆయనకు నిజమైన స్వరాజ్యం అంటే ప్రతి గ్రామం స్వయం సమృద్ధిగా ఉండటం. స్థానిక ప్రజలే నిర్ణయాలు తీసుకోవాలి, స్థానిక వనరులనే వినియోగించుకోవాలి, తమ అవసరాలను తామే తీర్చుకోవాలి. స్వయం పాలనతో నడిచే గ్రామమే ఆయన కలలలోని గ్రామ స్వరాజ్యం. ఈ ఆలోచనే తరువాత పంచాయతీరాజ్ రూపంలో ప్రాణం పొందింది.
హరిజనుల అభ్యున్నతి
హరిజనుల అభ్యున్నతి లేకుండా గ్రామాభివృద్ధి అసంపూర్ణం అని ఆయన స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి అందరికీ చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందని ఆయన నమ్మకం. ఆర్థిక ప్రగతి ఎంతైనా, నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి అసంపూర్ణం అని గాంధీజీ బోధించారు. సత్యం, అహింస, మితవ్యయం, స్వావలంబన. ఇవే ఆయన కలల గ్రామానికి పునాది. అభివృద్ధి కేవలం భౌతిక ప్రగతి కాకుండా ఆత్మీయతతో కూడినదిగా ఉండాలని ఆయన ఆశించారు. గాంధీజీ కాలంలో ఖాదీ, చర్కా గ్రామీణ ఉపాధి, స్వావలంబనకు ప్రతీకలు. నేడు అదే భావన డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా వంటి కార్యక్రమాల రూపంలో కొత్త రూపం సంతరించుకుంది. గ్రామ యువతకు ఐటీ, ఆన్‌లైన్ వ్యాపారం, డిజిటల్ సేవలు చేరడం గ్రామీణాభివృద్ధికి కొత్త ద్వారాలు తెరిచింది. గాంధీజీ శ్రద్ధ వహించిన శుభ్రత అంశం నేడు స్వచ్ఛ భారత్ ఉద్యమం రూపంలో కొనసాగుతోంది. అదే విధంగా ఆయన కోరుకున్న విద్య అందరికీ అనే ఆలోచన నేడు విద్యా హక్కు చట్టం ద్వారా వాస్తవ రూపం సంతరించుకుంది.
స్వదేశీ ఉద్యమం ద్వారా స్వీయాభివృద్ధి
గాంధీ స్వదేశీ ఉద్యమంలో వ్యక్తుల స్వీయాభివృద్ధి, స్వయం ఉపాధి ముఖ్యమని చెప్పేవారు. ప్రతి వ్యక్తి తన సామర్ధ్యాలను ఉపయోగించి జీవనోపాధి సాధించగలగాలి అని ఆయన భావించారు. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాలు నేర్పించడం ద్వారా వారు ఉపాధి సాధించగలరు. ఆర్థికంగా స్వతంత్రమవగలరు. విద్య అంటే పుస్తకాల పాఠాలు మాత్రమే కాదు, జీవన నైపుణ్యాలు, వ్యక్తిగత సామర్థ్యాలను కలిగించడం కూడా ముఖ్యం. మహిళలు, వంచితులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల యువతకు ప్రత్యేక శిక్షణా అవకాశాలు ఉంటాయి.
స్కిల్ ఇండియా అనేది గాంధీ ఆలోచనల ఆధునిక రూపం, ఇది యువతను నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి సాధించగలవని, ఆత్మనిర్భరత సాధించగలవని సాక్షాత్కరిస్తుంది. మహాత్మా గాంధీ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక యుగం. ఆయన ఆలోచనలు సమాజానికి శాశ్వత దారులు. అహింస ద్వారా శాంతి, సత్యాగ్రహం ద్వారా ప్రజల శక్తి, హరిజనోద్యమం ద్వారా సమానత్వం, స్వదేశీ ద్వారా ఆర్థిక స్వావలంబన, గ్రామ స్వరాజ్యం ద్వారా స్వయం సమృద్ధి- ఇవన్నీ ఆయన సమాజానికి ఇచ్చిన మహత్తర బహుమతులు. భారత సమాజం గాంధీ చూపిన దారిలో నడిస్తే నిజమైన స్వతంత్ర సమాజం నిర్మించగలుగుతాం.
గాంధీజీ ‘నై తాలీం’ విద్యా విధానం.
మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ‘నై తాలీం’ అంటే జీవితానికి విద్య అని అర్థం. దీని ఉద్దేశం విద్యను పుస్తకాల జ్ఞానానికి పరిమితం చేయకుండా, శారీరక, మానసిక, వృత్తిపరమైన, సామాజిక విలువలను కలిగి ఉండేవిధంగా రూపొందించడం. గాంధీజీ అభిప్రాయం ప్రకారం, విద్య కేవలం పుస్తకాల జ్ఞాన పరిమితిలో ఉండకూడదు. అది జీవితానికి అనుగుణంగా ఉండాలి. విద్యార్థుల చదువు లక్ష్యం ఒక మంచి ఉద్యోగాన్ని పొందడం మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి సాధించగలగడం, సమాజానికి సేవ చేయగలగడం, మానవతా విలువలు ముఖ్యమని ఆయన నమ్ముకున్నారు.
గాంధీ ‘నై తాలీం’లో హస్తకళలు, వ్యవసాయం, వృత్తిపరమైన శిక్షణను ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఈ విధానం ద్వారా విద్యార్థులు కేవలం పుస్తక పాఠాలను మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ నైపుణ్యాలను కూడా నేర్చుకోవడం జరిగింది. ఇది తాము జీవించగల సామర్థ్యాన్ని, స్వావలంబనను పెంపొందించేది. నైతిక, సత్య, ధర్మవంతమైన వ్యక్తిత్వం. ప్రతి విద్యార్థి పౌరుడుగా మాత్రమే కాకుండా, సమాజానికి సేవ, నిజాయితి, కష్టనిర్వహణకు తగిన వ్యక్తిగా మారాలి.
-డాక్టర్. ఎ. శంకర్
వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ