ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్​నగర్​, వెలుగు : పాలమూరును టూరిజానికి కేరాఫ్​గా మారుస్తామని  పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని,  నెక్లెస్ రోడ్, శిల్పారామం, ట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్, బ్యూటిఫికేషన్​పనులపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు పర్యాటకం అంటే ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు పాలమూరుకు తరలి వచ్చేలా  డెవలప్​చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్నారుల కోసం సాహస క్రీడల వేదికగా శిల్పారామం, ట్యాంక్ బండ్​ను మారుస్తామన్నారు.   బ్యూటిఫికేషన్​పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే వచ్చే నెల 4న పాలమూరులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం, బహిరంగసభ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  టూరిజం ఎండీ మనోహర్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ అకాడమీని క్రీడాకారులు వినియోగించుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో కోరారు. డిసెంబర్ ఒకటి నుంచి వాలీబాల్ అకాడమి కోసం క్రీడాకారుల ఎంపిక చేస్తామన్నారు. 14 నుంచి 18 ఏండ్ల  లోపు క్రీడాకారులను అధికారులు ఎంపిక చేస్తారని మంత్రి తెలిపారు.

భూమి పూజకు పిలువలేదని ఎంపీపీ, జడ్పీ చైర్​పర్సన్ ఆగ్రహం

మానవపాడు, వెలుగు: గురుకుల స్కూల్ ​ప్రారంభానికి తనని పిలిచి అవమానపరిచారని నడిగడ్డలో ఓ ఎమ్మెల్యే  ఆఫీసర్​ గల్లా పట్టుకున్న ఘటన మరువకముందే గురువారం జిల్లాలో మరో ప్రొటోకాల్​ వివాదం జరిగింది. మానవపాడు మండలం చిన్నిపాడులో రూ.5 లక్షల ఎమ్మెల్యే ఫండ్స్ తో సీసీ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ​వీఎం. అబ్రహం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డికి,  జడ్పీ చైర్​పర్సన్ ​సరితకు ఆహ్వానం అందలేదు. తన మండల పరిధిలో అధికారిక కార్యక్రమానికి ఎందుకు పిలువలేదని, గతంలో కూడా ఇలాగే చేశారని అశోక్​రెడ్డి ప్రెస్​మీట్​పెట్టి మండిపడ్డారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అడిగితే సరైన సమాధానం ఇస్తలేరని చెప్పారు.  

నాకు కూడా తెలియదు: జడ్పీ చైర్​పర్సన్​

మానవపాడు మండలంలో  అభివృద్ధి పనుల ప్రారంభానికి తనకు కూడా ఆహ్వానం లేదని జడ్పీ చైర్​పర్సన్​సరిత మీడియాతో అన్నారు. అధికారులు ప్రొటోకాల్​ఎందుకు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్​లీడర్ల మధ్య విభేదాలు పెట్టే విధంగా అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. 

పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలె : కలెక్టర్ ఎస్.వెంకట్ రావు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బ్యాంకుల లింకేజీతో అమలయ్యే వివిధ ప్రభుత్వ పథకాల లక్ష్యాలు వందశాతం సాధించేలా బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ ఎస్. వెంకటరావు కోరారు. గురువారం కలెక్టర్ ఆఫీస్​లో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ మీటింగ్ లో ఆయన  మాట్లాడారు. క్రాఫ్​లోన్లు,  స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల గ్రౌండింగ్ ను  స్పీడప్​చేయాలన్నారు.  వచ్చే ఫైనాన్షియల్​ఇయర్ వరకు వేచి చూడకుండా స్వయం సహాయక మహిళా సంఘాల రుణాలను ముందుగానే పూర్తి చేయాలన్నారు.  ప్రభుత్వ స్పాన్సర్ స్కీమ్స్​సరిగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ల గ్రౌండింగ్, పామాయిల్, పట్టుపరిశ్రమ లకు రుణాలిచ్చి సహకరించాలన్నారు. ఆర్బీఐ ఎల్డీవో తేజదీప్త బహార, నాబార్డ్ డీజీఎం ఎంవీవీఎస్​శ్రీనివాస్ రెడ్డి, ఏపీజీవీబీ ఆర్ఎం సుభాష్​, డీసీసీబీ సీఈవో లక్ష్మయ్య, పరిశ్రమల జిల్లా మేనేజర్ బాబు రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

పోడు భూముల దరఖాస్తులను కమిటీకి పంపండి : కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పోడు భూముల దరఖాస్తులను వెంటనే  జిల్లా రెగ్యులరైజేషన్ కమిటీకి పంపాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆర్డీవోలను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 138 పంచాయతీల నుంచి  పోడు భూముల  రెగ్యులరైజేషన్​ కోసం వచ్చిన 17,282 దరఖాస్తులను ఆర్డీవోలు పరిశీలించి అన్ని ఆధారాలతో సమర్పించాలన్నారు. లబ్ధిదారుల సిఫారసు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు మనూ చౌదరి, మోతిలాల్, జిల్లా ఎస్టీ వెల్ఫేర్​ఆఫీసర్​అనిల్ ప్రకాశ్,  డీపీవో కృష్ణ, ఆర్డీవోలు నాగలక్ష్మి, రాజేశ్​కుమార్, పాండు నాయక్ పాల్గొన్నారు.

12 ఏళ్లుగా నరకం చూస్తున్నం : నేరడగం గ్రామస్తులు

మాగనూర్, వెలుగు: 12 ఏండ్లుగా నరకయాతన పడుతున్నామని నేరడగం ముంపు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు  త్రిసభ్య కమిటీ మెంబర్లు బుధవారం నేరడగం గ్రామాన్ని విజిట్​చేశారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ జీవో ఇచ్చి 12 ఏళ్లయినా పునరావాసం కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఊట రూపంలో నీరు గ్రామంలో పైకి వస్తుందని అధికారులు చూపించారు. గ్రామంలో పాముకాటుతో దాదాపు 20 మంది చనిపోయారన్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు గ్రామం జలదిగ్బంధంలో ఉంటుందన్నారు. త్వరగా పునరావాసం కల్పించాలని అధికారులను కోరారు. కమిటీ మెంబర్లు ఆర్అండ్ఆర్  డైరెక్టర్ రూపాన్ష్ దత్తా,  జియాలజీ డిపార్ట్​మెంట్​డైరెక్టర్ అమీద్ ఖాన్, ఎస్డీసీ పండిత్ మధునూరే, ఇరిగేషన్ ఎస్ఈ శివధర్మ తేజ, గ్రామస్తులు ఉన్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలో కుటుంబ కలహాలతో  ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సంజయ్ నగర్ కాలనీకి చెందిన శేఖర్ (35) చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవించేవాడు. వచ్చిన ఆదాయం సరిపోక తరచూ భార్యాభర్తలు గొడవపడేవారు. దీంతో మనస్తాపం చెందిన శేఖర్​గురువారం నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని మిషన్ కాంపౌండ్  వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని, అక్కడే ఒంటిపై పెట్రోల్​చల్లుకుని నిప్పు అంటించుకున్నాడు. గమనించిన  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లే సరికి తీవ్రంగా కాలి చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

యువకుడి ఆత్మహత్య

ధన్వాడ, వెలుగు: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధన్వాడ ఎస్సై రమేశ్​వివరాల ప్రకారం.. చింతల శ్రీనివాస్(​22) బుధవారం అర్ధరాత్రి పాతపల్లి వాగు సమీపంలో  చెట్టుకు ఉరివేసుకున్నాడు. గున్ముకుల గ్రామానికి చెందిన భానుప్రకాశ్, నాగరాజు, శివకుమార్​అనే ముగ్గురు యువకులు తనను  బెదిరించడం వల్ల తన అన్న ఆత్మహత్య చేసుకున్నాడని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల కారణాలు, ఎందుకు బెదిరించారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.  

చివరి ఆయకట్టుకు సాగునీరందించడమే లక్ష్యం

వీపనగండ్ల, వెలుగు: చివరి ఆయకట్టుకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి అన్నారు. గురువారం ఆయన  మండల కేంద్రంలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్ దిన్నె రిజర్వాయర్ వరకు రూ.147 కోట్ల  తో కాలువ నిర్మాణ పనులు చేపట్టామని, దీంతో కోడేరు, పానగల్​, వీపనగండ్ల, చిన్నంబావి  చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు,  సింగిల్ విండో చైర్మన్ రామన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

కరెంట్ ​షాక్​తో ఒకరి మృతి

పానగల్, వెలుగు: వరికోత మెషీన్​కు కరెంటు వైర్లు తాకడంతో షాక్​తో ఆపరేటర్​మృతిచెందాడు.  వనపర్తి జిల్లా పానగల్​ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన బాలయ్య గ్రామ శివారులో పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. కోతల కోసం సింగాయిపల్లి గ్రామానికి చెందిన వరికోత మెషిన్​ఆపరేటర్​కుందేళ్ల మల్లేశ్​యాదవ్​(34)ను పిలిచాడు. గురువారం మధ్యాహ్నం మల్లేశ్​వరికో సేందుకు పొలానికి చేరుకున్నాడు. పొలంలో పైన 33/11 కేవీ వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు వరికోత మెషీన్​కు తగలడంతో మల్లేశ్​షాక్​కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్న పర్వతాలు ఫిర్యాదు మేరకు ఎస్సై నాగన్న  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

టీఆర్ఎస్​ అవినీతిని ఎండగట్టేందుకే బీజేపీ యాత్ర

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : టీఆర్ఎస్​ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి లీడర్ల వరకు చేస్తున్న అవినీతిని ఎండగట్టి ప్రజలకు వివరించేందుకే  బీజేపీ ఆధ్వర్యంలో  ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’ యాత్రను నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి అన్నారు.  గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బైక్​యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. బిజినేపల్లి మండలంలో  బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. సాయంత్రం మండల కేంద్రంలో ముగింపు సభ ఉంటుందన్నారు. 26న తిమ్మాజీపేట మండలంలో 28, 29, 30 తేదీల్లో మిగతా మండలాల్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.  బీజేపీ సీనియర్​నేత సుధాకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ భాస్కర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.

నెట్​బాల్​ పోటీలకు స్టూడెంట్ల ఎంపిక

ధన్వాడ, వెలుగు: మండలంలోని కొండాపూర్​ఎస్టీ గురుకుల స్కూల్​కు చెందిన 18 మంది స్టూడెంట్లు రాష్ట్రస్థాయి 5వ సబ్​ జూనియర్​ నెట్​బాల్​ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్​ రాజారాం, కోచ్ రామ్మోహన్​గౌడ్​ బుధవారం తెలిపారు.  గద్వాల జోన్ తరఫున ఎంపికైన వీరు ఈనెల 25 నుంచి 27 వరకు నిజామాబాద్​ జిల్లా నవీపేట్​లో జరిగే రాష్ట్ర స్థాయి సబ్​ జూనియర్​ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. 

దివ్యాంగులు ఆటల్లో రాణించాలి : జడ్పీ చైర్​పర్సన్​ సరిత

గద్వాల, వెలుగు: దివ్యాంగులు అన్ని రకాల ఆటల్లో  పోటీ పడాలని జడ్పీ చైర్​పర్సన్ ​సరిత అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం  సందర్భంగా  ఇండోర్ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించారు. హాజరైన జడ్పీ చైర్​ పర్సన్  జెండా ఊపి పోటీలను  ప్రారంభించారు. ట్రై సైకిల్ రేస్, రన్నింగ్, షాట్ పుట్, చెస్ తదితర  పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ  దివ్యాంగుల హక్కులను కాపాడేందుకు  తనవంతు కృషి చేస్తానన్నారు.  సంక్షే మ శాఖ అధికారి సాయదా బేగం, స్పోర్ట్స్ ఆఫీసర్ రమేశ్​బాబు, బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్​ రంగన్న తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్​ అవినీతిని ఎండగట్టేందుకే బీజేపీ యాత్ర

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : టీఆర్ఎస్​ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి లీడర్ల వరకు చేస్తున్న అవినీతిని ఎండగట్టి ప్రజలకు వివరించేందుకే  బీజేపీ ఆధ్వర్యంలో  ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’ యాత్రను నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి అన్నారు.  గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బైక్​యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. బిజినేపల్లి మండలంలో  బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. సాయంత్రం మండల కేంద్రంలో ముగింపు సభ ఉంటుందన్నారు. 26న తిమ్మాజీపేట మండలంలో 28, 29, 30 తేదీల్లో మిగతా మండలాల్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.  బీజేపీ సీనియర్​నేత సుధాకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ భాస్కర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.