వనపర్తి/పాన్గల్, వెలుగు : పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈనెల 17న పాన్గల్, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోమవారం పాన్గల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. పానగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్య బట్టు, అడిషనల్ కలెక్టర్ యాదయ్య, ఆర్వోలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థుల గుర్తులు అన్ని ఉన్నాయో.. లేదో.. చెక్ చేసిన తర్వాతే సామగ్రిని పంపిణీ చేయాలన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ బయట ఫారం 9 వివరాలు సక్రమంగా రాసి అతికించాలన్నారు. ఈ రెండు విషయాల్లో పొరపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పారు. జాగ్రత్తగా పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఏమైనా సందేహాలుంటే ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఏమైనా పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థిని లేదా వారి ఏజెంటును మాత్రమే అనుమతించాలని తెలిపారు. అనంతరం పానగల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండల కేంద్రాల్లోని పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కోసం చేయనున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు ఉన్నారు.
