కేసీఆర్ ఆలోచన మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు: మహేష్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఆలోచన మేరకే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు: మహేష్ కుమార్ గౌడ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కేసీఆర్ ఆలోచన మేరకే జరిగిందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. కేటీఆర్ ఢిల్లీకి పర్యటన తర్వాత బీజేపీ అధ్యక్ష మార్పుపై నిర్ణయం తీసుకున్నారన్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకే బీజేపీ కొంత బలపడిందన్నారు. బీజేపీతో బీసీలకు న్యాయం జరగదన్నారు. దళితులకు, బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు మహేశ్ కుమార్ గౌడ్. 

జూలై 5 న నుంచి రాష్ట్రంలో యువ పోరాట యాత్ర ప్రారంభమవుతుందన్నారు యూత్ కాంగ్రెస్ చీఫ్ శివసేనా రెడ్డి. మొత్తం 33 జిల్లాల్లో 33 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నుంచి తమ యాత్ర మొదలవుతుందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ సర్కార్ లక్షా 60 వేల బకాయి ఇవ్వాల్సి ఉందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. 

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి కేంద్రంగా మారిందన్నారు పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, సిద్ధిపేటలోనే వర్షాలు లేక పొలాల్లో విత్తనాలు వేసుకోలేని పరిస్థితి రైతులదన్నారు. కాళేశ్వరం ఉపయోగపడితే రైతులు బోర్లు వేసుకోవాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ భవన్ కి కరెంట్ బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్.. ఇవాళ 12 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు అయోధ్య రెడ్డి.