కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..  'పాలమూరు'కు జాతీయ హోదా  : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

 కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..  'పాలమూరు'కు జాతీయ హోదా  : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • రాహుల్​ను ప్రధానిని చేసి మూడు నెలల్లో సాధించుకుంటాం
  • టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​

మహబూబ్​నగర్/నాగర్ కర్నూల్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, రాహుల్​గాంధీ ప్రధానిని చేసిన మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​కు జాతీయ హోదా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ తెలిపారు. మహబూబ్​నగర్,  నాగర్​కర్నూల్​లో మంగళవారం  కొత్తగా నియమితులైన డీసీసీ ఆఫీస్​ బేరర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పాలమూరు జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైంది.

కానీ, జిల్లాను వెనుకపడేశారు. పాలమూరు , రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం  అవుతుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా బీజేపీ పెడచెవిన పెడుతోంది. పాలమూరు ప్రజల సాక్షిగా చెబుతున్నా.. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాబోతోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పాలమూరుకు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తాం’. అని  తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్​ పొత్తు దగ్గర్లోనే ఉంది

బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోవడం దగ్గర్లోనే ఉందని, ఈ రెండు పార్టీలు ఖానాపూర్, ఇబ్రహీంపట్నంలో జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో పోత్తుతో పోటీ చేశాయని తెలిపారు. రెండు పార్టీలు కలిసి వచ్చినా కాంగ్రెస్​కు నష్టం లేదని, ప్రజలు వారిని విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 15 రోజుల్లో రాష్ట్ర స్థాయి నామినేటెడ్, కార్పొరేషన్​ పదవులు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్​కు విజన్, దూరదృష్టి లేదని, రూ.  1.20 లక్షల కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలిపోయిందన్నారు. ఈ ప్రాజెక్టు గురించి కేటీఆర్​ అమెరికాలో గొప్పులు చెప్పుకుంటుండని, ఆ ప్రాజెక్టు కూలింది మాత్రం చెప్పుకుంటలేడని ఫైర్​ అయ్యారు. సీఎం రేవంత్​రెడ్డి దూర దృష్టి ఉన్న నేతగా ఫోర్త్​ సిటీని తీసుకొచ్చారన్నారు. మూడు రోజుల్లో5.78 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు హైదరాబాద్​కు వచ్చాయన్నారు.

మోదీ ప్రధాని అయిన తర్వాత  కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రాంతాల మధ్య పోరు పెడుతున్నారని విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్​ ముదిరాజ్, ప్రశాంత్​రెడ్డి పాల్గొన్నారు