ఈడీ, సీబీఐలు బీజేపీ చేతిలో ఉన్నాయి

ఈడీ, సీబీఐలు బీజేపీ చేతిలో ఉన్నాయి
  • కేసీఆర్‌‌‌‌ అవినీతిపై మాట్లాడుతున్నరు..  కానీ అరెస్ట్ చేయట్లే 
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  మహేశ్‌‌ కుమార్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులంతా సీఎం కేసీఆర్ అవినీతిపై మాట్లాడుతున్నారే తప్ప, విచారణ జరిపించి ఎందుకు అరెస్టు చేయడం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌‌ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు టీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ ప్రజలను దోచుకుంటున్నాయని మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, తెలంగాణలో అధికారంలోకి వస్తేనే.. కేసీఆర్‌‌‌‌ను అరెస్ట్ చేస్తామనడం బీజేపీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఈడీ, సీబీఐలు బీజేపీ చేతిలో ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేపర్‌‌‌‌కు తాము విరాళాలిస్తే ఈడీ నోటీసులు ఇచ్చిందని, కేసీఆర్‌‌‌‌కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

టీఆర్‌‌‌‌ఎస్ అవినీతిలో బీజేపీకి కూడా వాటా ఉందని, అందుకే కేసీఆర్‌‌‌‌పై చర్యలు తీసుకునేందుకు బీజేపీ భయపడుతున్నదని చెప్పారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.