
దీపావళి సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మూవీ పోస్టర్‌తో విషెస్ చెప్పాడు మహేష్‌బాబు. అయితే ఈ పోస్టర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసి పెద్ద టపాసే పేల్చాడు. జనవరి 13న ఈ సినిమా విడుదల అని దాదాపుగా ఏడాది ముందే అనౌన్స్ చేయడంతో, సర్కారు వారి సందడి సంక్రాంతికి ఖాయమనుకున్నారు ఫ్యాన్స్. కానీ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్టు మహేష్ నిన్న ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న విడుదలవుతోంది. ఒక వారం గ్యాప్ ఉన్నప్పటికీ సెకెండ్ వీక్ కలెక్షన్స్‌పై మహేష్ మూవీ ఎఫెక్ట్ ఏంతో కొంత పడుతుంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’కి దారి వదలడం కోసం తన సినిమా రిలీజ్ డేట్‌ని పోస్ట్‌పోన్ చేశాడు మహేష్ . ఇలా రాజమౌళి సినిమా కోసం మహేష్ మూవీ వెనక్కి వెళ్లడం ఇది రెండోసారి. గతంలో ‘బాహుబలి’ విషయంలోనూ ‘శ్రీమంతుడు’ సినిమాని ఇలాగే వాయిదా వేశారు. ఇప్పుడూ అదే జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి వర్క్ చేయబోయేది మహేష్‌తోనే. దాంతో ఈ అడ్జస్ట్‌మెంట్ జరిగింది. ‘సర్కారు వారి పాట’ స్పెయిన్ షెడ్యూల్‌ని ఈమధ్యనే కంప్లీట్ చేశారు. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో మహేష్, కీర్తి సురేష్‌ల జంటపై సాంగ్స్ తీశారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్‌బాబుతో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు.