రుణమాఫీకి కండిషన్లు ఏంటి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రుణమాఫీకి కండిషన్లు ఏంటి :  ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వస్తే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్  హామీ ఇచ్చిందని, కానీ.. రుణమాఫీ గైడ్​లైన్స్ లో కండిషన్లు పెట్టడం ఏంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 

ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్  ప్రభుత్వానికి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రీషెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అనడం సరికాదన్నారు.

ALSO READ : వచ్చే నెల 15లోగా రుణమాఫీ చేస్తం : ఉత్తమ్

రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్  కార్డుల జారీ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదని, రేషన్  కార్డు అనే కండిషన్  పెట్టి చాలా మందికి మాఫీని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. గతంలో ఒకే రేషన్  కార్డులో ఉన్న చాలా మంది అన్నదమ్ములు ఇప్పుడు వేరుపడ్డారని, భూములు పంచుకొని విడివిడిగా లోన్  తీసుకున్నారని ఆయన వెల్లడించారు. కానీ, కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తింపజేస్తే మిగతావారు నష్టపోతారని ఆయన వివరించారు.