- జెండా ఊపి రెండో విడత బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ఒక్కో బస్సుకు సెర్ప్ నుంచి రూ.30 లక్షలు,
- మండల సమాఖ్యల నుంచి రూ.6 లక్షలు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలను వ్యాపార భాగస్వాములుగా మార్చడం, సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఆర్టీసీ అద్దె బస్సుల’ స్కీమ్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. దీంతో రెండో విడతను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరికొన్ని బస్సులను కొనుగోలు చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మహిళా శక్తి’ మహాసభలో సీఎం రేవంత్‌రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించనున్నారు.
రెండో విడతలో 553 బస్సులు
రాష్ట్రంలోని మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ప్రభుత్వం అద్దె బస్సుల విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మండల సమాఖ్యల ఆధ్వర్యంలో 153 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగా.. అవి విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా మరో 553 బస్సులను మండల సమాఖ్యలు కొనుగోలు చేయగా.. నేడు స్కీమ్ ప్రారంభం అనంతరం ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు.
ఇందులో ఒక్కో బస్సు విలువ సుమారు రూ.36 లక్షలు కాగా.. ఇందులో సెర్ప్ ద్వారా రూ.30 లక్షలు సమకూర్చగా, మిగిలిన రూ.6 లక్షలను మండల సమాఖ్యలు తమ నిధులు లేదా బ్యాంక్ రుణాల ద్వారా భరించాయి. టీజీఎస్‌ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. బస్సుల మెయింటెనెన్స్ పోను ప్రతీ బస్సుపై నెలకు సుమారు రూ.69 వేల అద్దె మహిళా సంఘాలకు లభించనుంది.
రూ.500 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్న సీఎం
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మహాసభ వేదికగా మహిళల ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక ప్రకటనలు చేయనున్నారు. సభలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.500 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ చార్జీల కింద రూ.20.30 కోట్లతో పాటు కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఎస్‌ఆర్టీసీకి రూ.199 కోట్ల ఆర్థికసాయాన్ని అందించనున్నారు.
అంతేకాకుండా మహిళా సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి) ద్వారా ఇప్పటివరకు రూ.10,700 కోట్ల ఆదా జరిగిందని, ఇది మహిళల కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరిచిందో సభలో వివరించే అవకాశముంది. ఈ సభకు సుమారు 25 వేల మంది మహిళలు హాజరుకానున్నారు.
సీఎస్ సమీక్ష, సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న సీఎం సభ నేపథ్యంలో సీఎస్ రామకృష్ణారావు సోమవారం సెక్రటేరియట్‌లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మంత్రులు దనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
మహిళల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి మహాసభకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరావాలని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే భాగస్వాములుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన, సూక్ష్మ వ్యాపారాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
