న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) బీమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. కెనడాకు చెందిన మనులైఫ్తో 50:50 జాయింట్ వెంచర్ (జేవీ) కోసం ఒప్పందంపై సంతకం చేసింది. ఇరు కంపెనీలు రూ. 7,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ జేవీ పదేళ్లలో రూ. 18వేల కోట్ల నుంచి రూ. 30వేల కోట్ల మధ్య విలువను సాధించగలదని మహీంద్రా గ్రూప్ సీఈఓ అండ్ ఎండీ అనీష్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నంబర్‌వన్ లైఫ్ ఇన్సూరర్‌గా నిలవాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెగ్యులేటర్ నుంచి లైసెన్స్ కోసం రెండు- మూడు నెలల్లో దరఖాస్తు చేస్తామని, కార్యకలాపాలు ప్రారంభించడానికి 15 నుంచి 18 నెలలు పడుతుందని షా తెలిపారు. ఇరు కంపెనీలు రూ. 3,600 కోట్ల చొప్పున మూలధనం అందిస్తాయి. మొదటి ఐదేళ్లలో ప్రతి వాటాదారు రూ. 1,250 కోట్లు పెట్టుబడి పెడతారు. కాగా, భారతీయ జీవిత బీమా మార్కెట్ గత ఐదేళ్లలో 12 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందింది.
