నయీం అనుచరుడు ఏ1..ఆర్ఐ సంపత్ ఏ2

నయీం అనుచరుడు ఏ1..ఆర్ఐ సంపత్  ఏ2
  • రూ. కోట్ల స్థలానికి సెటిల్​మెంట్ చేస్తానని రూ.లక్షలు వసూలు
  • అడిగితే బెదిరింపులు  
  • అయినా పోలీసు అధికారి ఏ2 అట
  • పరారీలోనే ప్రధాన నిందితులు

హనుమకొండ, వెలుగు : వరంగల్ కేంద్రంగా భూదందాలకు పాల్పడుతున్న నయీం గ్యాంగ్​లో కొంతమంది అరెస్ట్​ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నయీం గ్యాంగ్​లో పని చేసిన ప్రధాన నిందితుడు, పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ముద్దసాని వేణుగోపాల్​ఉండగా.. అసలు సూత్రధారి ములుగు జిల్లాలో పని చేస్తున్న ఆర్​ఐ (రిజర్వ్​ఇన్​స్పెక్టర్) ​ముద్దసాని సంపత్​కుమారేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాశీలో ఉన్నట్లు సమాచారం. డిపార్ట్​మెంట్​లో ఆయనకు ఉన్న పరిచయాలతో భూదందాలకు తెరలేపినట్లు తెలిసింది. ఇందులో తనకు దగ్గరి బంధువు, నయీం దగ్గర పని చేసిన వేణుగోపాల్​తో పాటు మరి కొంతమంది ఇన్​వాల్వ్​అయ్యారు. ఇదిలాఉంటే సంపత్​కుమార్​కు వరంగల్ కు చెందిన మహిళతో 2014లో పెండ్లి కాగా, ఆయన అత్తగారు హనుమకొండ కాకతీయ కాలనీలోని ఓ ఇంటిని రాసిచ్చారు. దీంతో ఈ ఇంటిని వేణుగోపాల్​కు అప్పగించి, భూదందాకు డెన్​ గా మార్చారు. ఇదిలా ఉంటే ఆర్ఐ సంపత్​ తన భార్యను వదిలేసి ఇంకో పెండ్లి పెళ్లి చేసుకున్నాడని, ఇంటి విషయంలో అసలు ఓనర్లను బెదిరించాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఐతో పాటు వేణుగోపాల్​సహా పది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం అర్ధరాత్రి కేతెపాక రమేశ్​, బొజ్జ హరిబాబు, అలువాల నరేశ్​, మేకల రమేశ్​, పంగ రవి, టిపుల్​ప్రవీణ్​అలియాస్​ చక్రిలను రిమాండ్​కు తరలించిన విషయం తెలిసిందే. ఏ3గా ఉన్న మరో నిందితుడు, మాజీ ఎంపీపీ మల్లన్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సహకారంతో సీక్రెట్​ప్లేస్​లో తలదాచుకున్నట్టు తెలిసింది.

ఇలా వెలుగులోకి..

పైడిపల్లి సమీపంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ వెనకాల 423 సర్వే నెంబర్​లో దాదాపు 3,600 గజాల స్థలం ఉంది. మెయిన్​రోడ్డుకు దగ్గర ఉండడంతో ధర రూ.కోట్లలో ఉంది. ఈ భూమి విషయంలో వివాదం నడుస్తుండడంతో స్థలాన్ని నడికూడ మండలం చెర్లపల్లికి చెందిన రమేశ్​కు దక్కేలా చేస్తామంటూ ఆర్ఐ సంపత్​కుమార్​, వేణుగోపాల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.23 లక్షలు రమేశ్​నుంచి తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా తేల్చకపోగా, రమేశ్​నే తల్వార్లు, తుపాకీతో బెదిరించారు. వారి బెదిరింపులు భరించేలక రమేశ్​హసన్​పర్తి పోలీసులను ఆశ్రయించాడు. అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్​కు కేసు బదిలీ చేయగా.. ఆరుగురు నిందితులను పట్టుకుని కేయూ పోలీసులకు అప్పగించారు. 

ఎన్నో అనుమానాలు

​ఈ సెటిల్​మెంట్ల దందాలో ఆర్ఐ సంపత్ ​ప్రధాన పాత్రధారుడు కాగా, నయీం అనుచరుడు ముద్దసాని వేణుగోపాల్ ను ఏ1గా పేర్కొన్నారు. పోలీస్​ఆఫీసరే భూదందాలు, సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే డిపార్ట్​మెంట్ కు తలవంపులు వస్తాయనే ఉద్దేశంతో ఆయనను ఏ2 గా మార్చినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పడంలోనూ పోలీసులు తటపటాయిస్తుండడం వివిధ అనుమానాలకు తావిస్తోంది. వీరిని నాలుగు రోజుల కిందే పట్టుకున్నా శనివారం అర్ధరాత్రి రిమాండ్​కు తరలించడం, అన్ని రోజులు ఎంక్వైరీ చేసి ఆర్ఐతో పాటు వేణుగోపాల్​ ను పట్టుకోకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. వేణుగోపాల్​కు సీఎంకు దగ్గరగా ఉండే ఓ ప్రజాప్రతినిధితో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే తో కూడా కొన్ని భూదందాలు, సెటిల్​మెంట్లలో షేర్లు అందినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కేసును రహస్యంగా విచారణ జరిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసు విచారణ సమగ్రంగా సాగుతుందో లేదోననే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు దొరికితేనే పూర్తి విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.