గాజా దవాఖానలో చీకట్లు.. ఐసీయూలో మృత్యువాత పడుతున్న పేషెంట్లు

గాజా దవాఖానలో చీకట్లు.. ఐసీయూలో మృత్యువాత పడుతున్న పేషెంట్లు
  • ఇంధనం అయిపోవడంతో ఆగిన జనరేటర్..
  • అల్ షిఫా ఆస్పత్రికి నిలిచిన విద్యుత్​ సరఫరా

గాజా/జెరూసలెం : గాజా సిటీలోని అతిపెద్ద దవాఖాన అయిన అల్ షిఫా హాస్పిటల్​లో కూడా చీకట్లు కమ్ముకున్నాయి. ఇప్పటికే మందులు, పరికరాల కొరత ఎదుర్కొంటున్న దవాఖానలో శనివారం చీకట్లు అలముకున్నాయి. దీనికి కారణం ఇంధనం అయిపోవడమేనని సమాచారం. దీంతో ఐసీయూలో ఉన్న ఓ పసికందు సహా ఐదుగురు పేషెంట్లు మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరెంట్ లేక పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలేదని, ఐసీయూలో ఉన్నవారిని కాపాడలేకపోతున్నామని డాక్టర్లు తెలిపారు. మరోవైపు అల్ షిఫా ఆస్పత్రినే హమాస్ మిలిటెంట్లు తమ ప్రధాన కమాండ్ పోస్ట్​గా చేసుకున్నారని, ఆ దవాఖాన వద్ద టన్నెల్ కూడా ఏర్పాటు చేసుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో 11,070 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని గాజా హెల్త్ మినిస్ట్రీ శనివారం వెల్లడించింది. 2,700 మంది శిథిలాల కింద సమాధి అయి ఉంటారని తెలిపింది. ఇక గాజాలోని రెఫ్యూజీ క్యాంపుల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మురికినీళ్ల కోసం సైతం గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. కుటుంబంలో ఎవరు పస్తులుండాలి? ఎవరు తినాలి? అంటూ వంతులేసుకుంటున్నారు.   

మాక్రన్​పై మండిపడ్డ నెతన్యాహు

గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక ప్రజలు బలైపోతున్నారని, వెంటనే దాడులను ఆపాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రన్ అన్నారు. అమాయకులపై బాంబు దాడులు సరికాదంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్రన్ కామెంట్ చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ చర్యలను కాకుండా హమాస్ మిలిటెంట్ల దారుణాలను ఖండించాలని అన్నారు. నేడు తమపై జరిగినట్లుగానే రేపు పారిస్​ లోనో లేక న్యూయార్క్​లోనో  టెర్రర్​  దాడులు జరగొచ్చన్నారు.