కాంగ్రెస్ టార్గెట్​గా మజ్లిస్ పాలిటిక్స్

కాంగ్రెస్ టార్గెట్​గా మజ్లిస్ పాలిటిక్స్
  • రాహుల్​కు సవాల్ విసిరి సంకేతాలు
  • బీఆర్ఎస్ వెంటేనని స్పష్టం చేసిన అసద్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ను టార్గెట్ చేస్తూ మజ్లిస్ పార్టీ రాజకీయాలకు తెరలేపింది. ఆ పార్టీని అడ్డుకునేందుకు తన ప్రయత్నాలు షురూ చేసింది. తన మిత్రపక్షమైన బీఆర్ఎస్​కు మద్దతు పలికేందుకే ఈ స్టాండ్ తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్‌‌ పార్టీని ఆదిలోనే దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నది. రాహుల్ గాంధీ దమ్ముంటే హైదరాబాద్​లో పోటీ చేయాలని, బాబ్రీ మసీదును కూల్చింది కాంగ్రెస్ పార్టీయే అంటూ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు చేశారు.

 బీఆర్ఎస్ వెంటే మజ్లిస్ అని ఇప్పటికే అసద్ స్పష్టం చేశారు. మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో ముస్లింలు మద్దతు ఇవ్వాలని, ఎంఐఎం బరిలో లేని సెగ్మెంట్లలో బీఆర్ఎస్​కు సపోర్ట్ చేయాలనే సంకేతాలు ఇప్పటికే లీడర్లు, కార్యకర్తల్లో వెళ్లాయి. తెలంగాణలో ముస్లింలకు అనుకూలమైన ప్రభుత్వం ఉందని, ఇక్కడి మైనారిటీలకు పెద్దఎత్తున బడ్జెట్ కేటాయిస్తున్నదని అసద్ పలుమార్లు ప్రకటించారు. 

మైనారిటీ గర్ల్స్​కు 6 నుంచి 12వ తరగతి వరకు ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నదని గుర్తు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌‌కు మద్దతు పలికిన మజ్లిస్.. గత 9ఏండ్లుగా దూరంగా ఉంటున్నది. తాజాగా కాంగ్రెస్‌‌ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో మజ్లిస్​ను ఆహ్వానించలేదు. ఈ క్రమంలో మజ్లిస్‌‌ చీఫ్ కాంగ్రెస్‌‌ను టార్గెట్‌‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్​కు ఓపెన్​గా మద్దతు ప్రకటిస్తూ ముందుకెళ్తున్నది.