
2001 నుంచి 2017 వరకు 20.42 లక్షల మంది బలి
యుద్ధం, జబ్బులు, పాము కాట్లతో పోలిస్తే వాటి వాటానే ఎక్కువ
హైవేలు, స్ట్రైట్ రోడ్లపైనే ఎక్కువ యాక్సిడెంట్లు.. అతివేగమే ప్రధాన కారణం
చనిపోతున్న వాళ్లలో 86 శాతం మంది మగాళ్లే
రోడ్లపై గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాలు 2 శాతమే
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఫైన్లను భారీగా పెంచేసింది. అయితే, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, బయట జనాలు సెటైర్లు పేల్చుతున్నారు. బండి అమ్మినా చలాన్లు కట్టలేమని జోకులు పేలుస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి, పెళ్లి చూపుల్లో కట్నాలకూ ముడిపెడుతున్నారు. ముందు గుంతల రోడ్లను బాగు చేసి ఫైన్లు పెంచండంటూ విమర్శలూ గుప్పిస్తున్నారు. ఆ విమర్శలు, సెటైర్లు ఎలా ఉన్నా, రోడ్డు ప్రమాదాల్లో ఏటా కొన్ని లక్షల మంది చనిపోతున్నారన్న సంగతి తెలుసా? గుంతల రోడ్లపై కాకుండా, నున్నగా ఉన్న రోడ్లు, హైవేలపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎక్కువ మంది చనిపోతున్నారని తెలుసా? ఆ ప్రమాదాల్లోనూ అతివేగం, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి కారణాలతోనే ఎక్కువ మంది బలవుతున్నారన్న సంగతి తెలుసా? కేంద్రం ఏటేటా విడుదల చేసే లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
ఎక్కువ మగాళ్లే చనిపోతున్నరు
ఒక సినిమా చూసినంతసేపట్లో సగటున 185 ప్రమాదాలు జరిగితే అందులో 57 మంది చనిపోతున్నారు. 185 మంది గాయపడుతున్నారు. ఓ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను లెక్కగా తీసుకుంటే (7.45 గంటలు) సగటున 130 మంది చనిపోతున్నారు. 418 మంది గాయపడుతున్నారు. ప్రమాదాల సంఖ్య 409. అదే లెక్కలను ఒక రోజుకు లెక్కేస్తే, సగటున దేశవ్యాప్తంగా 1,274 మంది చనిపోతున్నారు. 1,308 మంది తీవ్రగాయాలపాలవుతున్నారు. అందులో చాలా మంది జీవితాంతం అవిటివాళ్లుగా మిగిలిపోతున్నారు. 2017లో (ఏడాది మొత్తం) 1,47,913 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. అది 65 ఏళ్లలో వరదలకు చనిపోయిన వారితో పోలిస్తే ఎక్కువ. 1953 నుంచి 2017 మధ్య వరదలకు 1,07,535 మంది చనిపోయారు. ఇక, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నది 86 శాతం మగాళ్లే. అందులో చాలా మంది ఇంటికి పెద్ద దిక్కైనోళ్లే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆడ, మగవాళ్లను లెక్కలోకి తీసుకుంటే చనిపోతున్న వాళ్లలో 72 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల వయసున్నోళ్లే.
20.42 లక్షల మంది..
2001 నుంచి 2017 మధ్య రోడ్డు ప్రమాదాలకు బలైపోయిన వాళ్లు దాదాపు 20.42 లక్షల మంది. మరో 82.30 లక్షల మంది గాయాలపాలయ్యారు. మొత్తంగా 79.10 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రతి పది నిమిషాలకు 9 ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే దాదాపు నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోంది.
హైవేలు, మంచి రోడ్లపైనే ఎక్కువ
2017లో 4.64 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే, అందులో 30.4 శాతం ప్రమాదాలు హైవేలపైనే జరిగాయి. ఆ ప్రమాదాల్లో 53,181 మంది చనిపోయారు. స్టేట్రోడ్లపై జరిగిన ప్రమాదాల వాటా 25 శాతం అయితే, చనిపోయినోళ్లు 27 శాతం మంది ఉన్నారు. సగం రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ ఎక్కువగా లేని రోడ్లపైనే జరుగుతున్నాయి. సిటీ రోడ్లు, ఇళ్ల మధ్య, మార్కెట్ల వద్ద ప్రమాదాలు 38%.
గుంతల వల్ల 2 శాతమే
జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో స్ట్రైట్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల వాటానే 64.2 శాతం. మలుపుల వద్ద 11.6 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపై పడిన గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాల వాటా కేవలం 2 శాతం. 70% రోడ్డు ప్రమాదాలు అతివేగం వల్ల జరుగుతున్నవే. డ్రంకెన్ డ్రైవింగ్‌లో 3%, రాంగ్‌రూట్‌లో 6% ప్రమాదాలు జరుగుతున్నాయి. వాతావరణం అంతా మంచిగున్నప్పుడే దాదాపు 73 శాతం ప్రమాదాలు జరిగాయి. వర్షం వల్ల 9.5 శాతం, మంచు ప్రభావంతో 5.8 శాతం ప్రమాదాలు 2017లో జరిగాయి. ఎక్కువ ప్రమాదాలు బైకులకే జరగడం గమనార్హం. 34 శాతం వాటా వాటిదే. ఆ తర్వాత కార్లు, జీపులకు అవుతున్న యాక్సిడెంట్ల వాటా 25.4 శాతం. ట్రక్కుల వాటా 20 శాతం.