- కాంగ్రెస్ నుంచి నేను బయటకు రాలే.. వాళ్లే వెళ్లగొట్టారు
- బీసీలకు ఏటా లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలి
వరంగల్, వెలుగు : కాంగ్రెస్, బీఆర్‍ఎస్, బీజేపీ.. మూడు పార్టీలూ బీసీ ద్రోహులేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 19) మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‍రెడ్డి బీసీల వ్యతిరేకి అని విమర్శించారు.
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన 26 అంశాల్లో ఓ ఒక్కటి అమలుచేసినట్లు నిరూపించినా తాను అమరవీరుల స్తూపం వద్ద క్షమాపణలు చెబుతానని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించి మోసం చేసిందని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాలేదని.. వారే వెళ్లగొట్టారన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై క్లారిటీ వచ్చాక తన రాజీనామాపై ఆలోచన చేస్తానని చెప్పారు.
బీసీల విషయంలో తమతో కలిసి వస్తామంటే.. కాంగ్రెస్ పార్టీని సైతం తమ పార్టీలో విలీనం చేసుకుంటామని.. కానీ అది అయ్యేపని కాదని అభిప్రాయపడ్డారు. కల్వకుంట్ల కవితతో కలిసి తాము పనిచేయబోమని, ఆమె దుకాణం క్లోజ్ అయిందని, కవితతో ఆమె తండ్రే కలవకపోతే తామెలా కలుస్తామని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్‍పీ ఆధ్వర్యంలో 10 అంశాలతో వరంగల్ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రొఫెసర్ జయశంకర్‍ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని, కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ప్రకటించాలని, బీసీలకు ఏటా రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, 18 లక్షల పేద బీసీల కుటుంబాలకు రెండు ఎకరాల చొప్పున భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల పేదలకు ఇండ్లు కట్టిస్తామని, సచార్ కమిటీ నివేదిక ప్రకారం పేద ముస్లింలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని చెప్పారు. జనాభా దామాషా ప్రకారమే బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని.. ఉద్యమకారులు, జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా అందజేస్తామని వివరించారు. వరంగల్ ను రెండో రాజధానిగా ప్రకటించాలని కోరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రజిని యాదవ్, హరిశంకర్‌గౌడ్, జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య, సూర్యారావు, పల్లె అశోక్, మదనమోహన్‍చార్య, జ్యోతి పాల్గొన్నారు.
