బల్దియాల్లో సెలక్షన్స్ కమిటీలు..మున్సిపల్ ఎన్నికల్లో క్యాండిడేట్ల ఎంపికలపై ప్రధాన పార్టీలు కసరత్తు

బల్దియాల్లో సెలక్షన్స్ కమిటీలు..మున్సిపల్ ఎన్నికల్లో క్యాండిడేట్ల ఎంపికలపై ప్రధాన పార్టీలు కసరత్తు
  • కమిటీలతో కాంగ్రెస్, సమన్వయకర్తలతో  బీఆర్ఎస్, ఇన్ చార్జీలపై బీజేపీ ఫోకస్ 
  • పోటా పోటీగా సన్నాహక సమావేశాలు 
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో   పురపాలక ఎలక్షన్ సందడి  

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు:  ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థులపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు, 410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 

మున్సిపల్ ఓటరు లిస్ట్ సవరణలు, ఎన్నికల నిర్వహణపై ఇతరత్రా పనులు వేగంగా కొనసాగుతుండడంతో ప్రధాన పార్టీలు కూడా అదే వేగంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కమిటీలతో కాంగ్రెస్, సమన్వయకర్తలతో బీఆర్ఎస్, ఇన్ చార్జీలతో బీజేపీ ఎన్నికల సమరానికి దిగబోతున్నాయి . బల్దియాలపై ఎలాగైనా జెండా ఎగురవేయాలని ఆ మూడు పార్టీలు బలమైన క్యాండిడేట్ల కోసం కసరత్తు చేస్తున్నాయి. 

ప్రతి మున్సిపాలిటీ నుంచి ఒక్కో వార్డుకు నలుగురు ఆశావాహుల చొప్పున జాబితాను తయారు చేసి రిజర్వేషన్ల అనుకూలతను బట్టి  క్యాండిడేట్లను ఎంపిక చేసే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. 

17లో 9 మంది వారే... 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎక్కువగా సిద్దిపేట జిల్లాకు చెందిన వారే ఉన్నారు.  17 మున్సిపాల్టీలకు బీఆర్ఎస్ సమన్వయ కర్తలను ప్రకటించగా, అందులో సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 9 మంది నేతలు ఉండడం పట్ల చర్చనీయాంశంగా మారింది. 

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టుసాధించాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక ప్రణాళకతో ముందుకు వెళ్తుండగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సన్నిహితులే ఎక్కువగా సమన్వయ కర్తలుగా ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో హరీశ్‌‌ రావు కీలక పాత్ర పోషించనున్నారు.       

సంగారెడ్డి జిల్లాలో... 

 సంగారెడ్డి జిల్లాలో మూడు ప్రధాన పార్టీలకు మున్సిపల్  ఎన్నికలు సవాల్ గా మారాయి . జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు, 263 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై పార్టీలు ఫోకస్ చేసి కమిటీల ఎంపికను వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో పార్టీలు దాదాపు సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకున్నాయి. 

సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించగా, ఆశావాహుల నుంచి అప్లికేషన్లు తీసుకుని టికెట్లు ఖరారు చేసే బాధ్యతను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీసుకున్నారు. ఇదే తరహాలో మిగతా 4 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు ఆయా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 11 మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తల పేరుతో కమిటీల ఎంపికను పూర్తి చేసింది. 

ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో సోమవారం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలతో కలిసి స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసే పనులు మొదలయ్యాయి. పార్లమెంట్, శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రధానంగా దృష్టి సారించింది. ఎ

స్సీ, ఎస్టీ, బీసీల వారిగా ఆశావాగుల జాబితాను సిద్ధం చేస్తోంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సమక్షంలో ఇప్పటికే సంగారెడ్డి, పటాన్ చెరు సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా కసరత్తు మొదలుపెట్టారు.          

మెదక్ జిల్లాలో... 

మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ ప్రసిడెంట్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ స్థానాలకు పోటీలో నిలిపేందుకు ధీటైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 

బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ ను నియమించింది. అభ్యర్థుల ఎంపికపై మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అంతర్గతంగా పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. 

అలాగే బీజేపీ అభ్యర్థుల ఎంపిక పై మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ దృష్టి సారించారు. ఇటీవల నర్సాపూర్, మెదక్ రామాయంపేట లో పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సంక్రాంతి పండుగ తరువాత కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 

సిద్దిపేట జిల్లాలో... 

సిద్దిపేట జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాల్టీల్లో 115  వార్డులుండగా  ప్రస్తుతం నాలుగు మున్సిపాల్టీల్లోని 72 వార్డులకు మాత్రమే  ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట మున్సిపల్ పాలక వర్గం గడువు మే నెల వరకు ఉండటంతో ఇక్కడ ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించాయి. 

జిల్లాలోని  మూడు మున్సిపాల్టీల్లో  బీఆర్ఎస్ తరపున హరీశ్‌‌ రావు ,  చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన‍ అభ్యర్థులను బరిలోకి దించడం కోసం ఇప్పటికే ప్రాథమిక కసరత్తును పూర్తి చేశారు. రిజర్వేషన్ల ఖరారు తరువాత  గెలుపు గుర్రాలను దింపాలనే దిశగా బీఆర్ఎస్, బీజెపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు.