మ‌‌‌‌రింత బాధ్యతగా మంచి సినిమాలు: వేణు ఉడుగుల

మ‌‌‌‌రింత బాధ్యతగా మంచి సినిమాలు: వేణు ఉడుగుల

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన గద్దర్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ అవార్డుల్లో ‘రాజు వెడ్స్‌‌‌‌ రాంబాయి’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు మరో మూడు పురస్కారాలను గెలుచుకుంది.  ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ క్రిటిక్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ మూవీ టీమ్‌‌‌‌ను అభినందించింది.  ఈటీవీ విన్‌‌‌‌, రాహుల్‌‌‌‌ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్‌‌‌‌, తేజస్విరావు జంటగా నటించగా సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.  

అభినందన సభలో వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘సినీ విమర్శకులు మమ్మల్ని పిలిచి మరీ అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది మాపై మరింత బాధ్యతను పెంచింది.  మరిన్ని మంచి సినిమాలను నిర్మించే ప్రోత్సాహాన్ని ఇచ్చింది’ అని చెప్పారు.  దర్శకుడు సాయిలు మాట్లాడుతూ ‘నేను చూసిన జీవితాల నుంచి రాసుకున్న కథ నన్ను ఇంత దూరం తీసుకొస్తుందని అనుకోలేదు.  డబ్బులు వస్తే చాలనుకున్నా..  అవార్డులు కూడా రావడం బోనస్‌‌‌‌. ఈ ప్రశంసలు మస్త్ మజాను ఇచ్చాయి’ అని చెప్పాడు.  ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత రాహుల్‌‌‌‌ మోపిదేవి, సమర్పకులు నాగేశ్వరరావు పూజారి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, నటులు శివాజీరాజా, చైతూ జొన్నలగడ్డ, నటి అనితా చౌదరి, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌‌‌‌న్ ప్రతినిధులు ప్రభు,  బత్తుల ప్రసాద్, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.