నేరేడుతో హల్వా.. ఐస్ క్రీం

నేరేడుతో హల్వా.. ఐస్ క్రీం


కాస్త పులుపు..ఇంకాస్త తీపి.. మరికాస్త  వగరు ఈ రుచులన్నీ కలిపితే నేరేడు పండ్లు. నిగనిగలాడుతూ నోరూరించే ఈ పండ్లలో ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు నేరేడులో 30.2 మిల్లీ గ్రాముల విటమిన్​– సి ఉంటుంది. విటమిన్​ –ఎ, బి1, బి2, బి3, బి6, కే, ఈలు కూడా పుష్కలం. ఐరన్​, మాంగనీస్​, పొటాషియం కూడా ఎక్కువే. ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఈ పండుని ఎప్పుడూ ఒకేలా ఎందుకు తినాలి. కాస్త వెరైటీగా తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకని హల్వా, ఐస్​క్రీమ్​, స్మూతీ చేసేయండి... టేస్టీటేస్టీగా తినేయండి.

హల్వా

కావాల్సినవి
నేరేడు పండ్లు– ఒక కప్పు
పాలు(కాచి, చల్లార్చినవి)– ఒక కప్పు
చక్కెర– అర కప్పు
నెయ్యి– మూడు టీ స్పూన్​లు
డ్రై ఫ్రూట్స్​ (పలుకులు) – అర టేబుల్ స్పూన్​
బ్రెడ్​ ముక్కలు– అర కప్పు
కోవా– రెండు టీ స్పూన్​లు
యాలకుల పొడి– ఒక టీ స్పూన్​
కిస్​మిస్​– ఒక టీ స్పూన్​

తయారీ

నేరేడు పండ్లని శుభ్రంగా కడిగి, గింజలు తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి. పాన్​లో రెండు టీ స్పూన్​ల నెయ్యి వేడిచేసి అందులో డ్రైఫ్రూట్స్​ తరుగు, కిస్​మిస్​ వేగించి ఒక గిన్నెలోకి తీయాలి. అదే పాన్​లో మిగిలిన నెయ్యి వేడిచేసి నేరేడు ముక్కలు వేగించాలి. అందులో కోవా, పాలు, చక్కెర కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక బ్రెడ్​ ముక్కలు కలిపి మరికాసేపు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి తింటే టేస్ట్​ అదిరిపోతుంది. 

ఐస్​క్రీమ్​ 

కావాల్సినవి
నేరేడు పండ్లు– 100గ్రాములు
ఫ్రెష్​  క్రీమ్​– ఒక కప్పు
చక్కెర– ఒక కప్పు
పాలు– అర కప్పు

తయారీ

నేరేడు పండ్లని చేతితో మాష్​ చేసి, గింజలు తీసేయాలి. తరువాత మిక్సీ జార్​లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేయాలి. అందులో చక్కెర వేసి మరోసారి గ్రైండ్​ చేయాలి. తర్వాత ఫ్రెష్​ క్రీమ్, పాలు కూడా వేసి ఇంకోసారి మిక్సీ పట్టి ఒక బాక్స్​లోకి తీయాలి. ఆ బాక్స్​ని ఎనిమిది గంటలు డీప్​ ఫ్రిజ్​లో పెడితే నోరూరించే నేరేడుపండు ఐస్​క్రీమ్​ రెడీ.

పచ్చడి

కావాల్సినవి
నేరేడు పండ్లు– ఒక కప్పు
కారం, ఉప్పు– సరిపడా
పసుపు, ఇంగువ– చిటికెడు    
నూనె– తగినంత​
ఆవాలు– ఒక టీ స్పూన్
చక్కెర, మెంతులు– ఒక్కోటి పావు టీ స్పూన్​ చొప్పున                         
కరివేపాకు– కొంచెం

తయారీ
నేరేడు పండ్ల గింజలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పాన్​లో నూనె  వేడిచేసి ఆవాలు, మెంతులు వేగించాలి. అందులో ఇంగువ, కరివేపాకు, నేరేడు ముక్కలు, పసుపు, ఉప్పు  ఒకదాని తర్వాత ఒకటి వేసి కాసేపు మూతపెట్టాలి. తర్వాత కారం , చక్కెర వేసి బాగా కలిపి స్టవ్​ ఆపేయాలి. పదినిమిషాల తర్వాత బాక్స్​లోకి తీయాలి. రైస్​తో పాటు చపాతి, బ్రెడ్స్​పై టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి.