కాఫీ ఆకులతో ఆర్గానిక్ చాయ్

కాఫీ ఆకులతో ఆర్గానిక్ చాయ్

అరకు వ్యాలీ నుంచి ఆకులు తీసుకొచ్చాడు. సిలికాన్ వ్యాలీలో వాటిపై రీసెర్చ్ చేశాడు. తెలంగాణలో వాటితో ఆర్గానిక్ చాయ్ తయారుచేశాడు. శ్రమను కాచి, లాభ నష్టాలను వడబోసి, టేస్టీ చాయ్తో ఒక రుచికరమైన సక్సెస్ సాధించాడు. ఇంతకీ ఈ ‘ప్రకృతి పానీయం’లో  ఏముంది? దాన్ని ఎలా తయారుచేశారు? 

అరకులో పండే కాఫీకి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ కాఫీ ఆకుల నుంచే ఒక హెర్బల్ డ్రింక్ని తయారుచేశారు. అంటే అరకు కాఫీ చరిత్రకు ఇది ఒక కొనసాగింపు. నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన రామన్ మాదల అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఫుడ్ టెక్నాలజీపై పట్టున్న ఆయన విదేశాల్లో తిరుగుతున్నపుడు, ఒక స్పెషల్ ఆర్గానిక్ టీ రుచి చూశాడు. అప్పుడే అలాంటి డ్రింక్ మన దగ్గర తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. ‘‘సిలికాన్ వ్యాలీలోని ఇథియోపియన్ రెస్టారెంట్లో మొదటిసారి కాఫీ ఆకులతో చేసిన టీ రుచి చూశా. దాన్ని ‘కుటి’ అని పిలుస్తారు. ఎండబెట్టిన ఆకులు మరగబెట్టుకొని రోజూ తాగడం అక్కడివాళ్ల సంప్రదాయం. దీన్ని తాగడం వల్ల అక్కడివాళ్లలో చాలామందికి డయాబెటిస్ రావడంలేదు. అలాంటిదే మనదేశంలో కూడా  తయారుచేయాలనే తపనతో రెండేళ్ల క్రితం అరకు, లంబసింగిలో కొన్ని రకాల కాఫీ ఆకులు సేకరించా. తరువాత  సిలికాన్ వ్యాలీలో రీసెర్చ్ చేశా. అవి టీ పొడికి పనికొస్తాయని తేలింది. అలా ‘ఆర్గానిక్ చాయ్’ని తయారుచేశా. హైదరాబాద్ దగ్గరలోని బొల్లారంలో ఒక యూనిట్ పెట్టి, అందులో ఈ టీ పౌడర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం” అని తన సక్సెస్ఫుల్ టీ జర్నీ గురించి చెప్పాడు రామన్.  
పారేసే ఆకులతో ... 
జూలైలో కాఫీ మొక్కలకు కొత్త చిగుర్లు వస్తుంటాయి. కాఫీ పండ్లకు పోషకాలు అందడం కోసం, ఆకులు, కొమ్మలు పెరగకుండా ఉండాలని వాటిని కోసి పారేస్తుంటారు. ఆలా పారేసే ఆకులతోనే ఈ టీ పౌడర్ని తయారుచేస్తారు. దీంతో ఇప్పటివరకు కాఫీ గింజలతోనే లాభాలు పొందుతున్న రైతులకు ఆకులతో కూడా లాభాలు వస్తున్నాయి. 
‘మొక్కలు ఎదిగే దశలో ఉన్నప్పుడు కొమ్మలు కోయాలి. కానీ.. దీనివల్ల టైం వృథా అవుతుందని కొందరు కోయరు. దాంతో దిగుబడి తగ్గుతుంది. అయితే.. ఇప్పుడు ఆకులకూ డబ్బులు రావడంతో కోస్తున్నారు. దానివల్ల కాఫీ గింజల దిగుబడి కూడా పెరుగుతుంది’ అంటుంది చింతపల్లిలోని మహిళా రైతు వెంకటలక్ష్మి. 
‘‘కాఫీ గింజలు గట్టి పడాలంటే ఏడాదికి రెండు సార్లు ఆకులు కత్తిరించాలి. ఎండబెట్టిన కిలో కాఫీ ఆకులకు రూ.90 నుంచి రూ120 వరకు ఇస్తున్నారు’ అన్నాడు మరో రైతు చిన్నారావు. 
ఆరోగ్యం కూడా 
ఇందులో  కెఫిస్ తక్కువగా ఉంటుంది. పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తేనీటి ప్రియుల అభిరుచులకు తగ్గట్టు ఈ ఆర్గానిక్ చాయ్ని కుటి, మార్నింగ్ టీ, గుడ్నైట్ టీ, రోసెల్లె టీ అని నాలుగు రకాలుగా తయారు చేశారు. దీన్ని ‘‘70 శాతం ఎండిన కాఫీ ఆకులు, 12శాతం అనాస పువ్వు, 10 శాతం నిమ్మగడ్డి, ఎనిమిది శాతం సోంపు విత్తనాలు వేసి తయారుచేస్తారు. పాలు, చక్కెర అవసరం లేదు. వేడి నీళ్లలో ఈ పొట్లాన్ని ముంచి తాగేయడమే. 

రైతుల చేదోడుతో... 
‘‘మన్యంలో కాఫీ పండించే వాళ్లలో కొందరిని ఒక సంఘంగా ఏర్పాటు చేశాం. ఆకులు కోసి, శుభ్రపరచడం, సోలార్ డ్రయ్యర్లతో ఆరబెట్టడంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. కాఫీ ఆకులను వాళ్లతోనే పొడి చేయిస్తున్నాం’
ఆఫ్రికాలో పుట్టిన కాఫీ? 
తెలంగాణలో ఆదిలాబాద్ ఫారెస్ట్ ప్రాంతంలో కూడా కాఫీ పంట సాగుకు అనుకూలంగా ఉంటుందని కాఫీ రైతులు చెప్తున్నారు. బొల్లారంలో ఈ ఆర్గానిక్ టీ యూనిట్లో అయిదుగురు పనిచేస్తున్నారు. 
దీనివల్ల 50 మంది రైతులకు అదనపు ఆదాయం వస్తోంది. ఈ టీ సాచెట్లు అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు. హైదరాబాద్లో డోర్ డెలివరీ చేయడానికి, ఎలక్ట్రిక్ బైక్లు, ఆటోలను ఏర్పాటు చేశారు. దీనిద్వారా 15మందికి పని ఇవ్వనున్నారు. అంతర్జాతీయంగా, కెనడియన్ కంపెనీ ఒక్కటే ఇలాంటి టీని తయారు చేస్తుంది. ఇండియాలో ఇదే మొదటిది. -శ్యాం మోహన్