
2024లో జరుగనున్న 96వ ఆస్కార్ ఆకాడమీ అవార్డ్స్(96 Oscar Awards) రేసు నుండి మలయాళ మూవీ 2018 తప్పుకుంది. డిసెంబర్ 22 శుక్రవారం రోజు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసిన 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో 2018 సినిమా పేరు లేదు. ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ వెల్లడించారు. దీంతో.. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ కు వెళుతుంది అని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
ఇక తన చిత్రం ఆస్కార్ రేస్ నుండి అవుట్ అవడం పట్ల ఎమోషనల్ పోస్ట్ చేశాడు దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్(Jude Anthany Joseph).. అందరికీ నమస్కారం. తాజాగా విడుదలైన ఆస్కార్ షార్ట్‌లిస్ట్ లో మా చిత్రం స్థానాన్ని పొందలేకపోయింది. ఇలా మీ అందరినీ నిరాశపరిచినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఏది ఏమైనప్పటికీ.. ఈ పోటీలో 2018 మూవీ ద్వారా భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. మా సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం, ఆస్కార్‌కి అధికారిక ప్రవేశం లభించడం అనేవి ఎవరికైనా అరుదైన విజయమే.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు జూడ్.
ఇదిలా ఉంటే.. ఇండియా నుండి ఝార్ఖండ్ గ్యాంగ్‌రేప్ ఆధారంగా తెరకెక్కిన.. టు కిల్ ఎ టైగర్.. అనే డాక్యుమెంటరీ చిత్రం బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో ఆస్కార్ కు ఎంపికయ్యింది.