కొమురవెల్లిలో ఘనంగా అగ్నిగుండాలు

కొమురవెల్లిలో ఘనంగా అగ్నిగుండాలు
  • కొమురవెల్లిలో ఘనంగా అగ్నిగుండాలు
  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు
  • ముగిసిన మల్లన్న  బ్రహ్మోత్సవాలు

కొమురవెల్లి, వెలుగు:  బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో చివరి ఆదివారం అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం బ్రహ్మ శ్రీ సిద్ధదయాళ శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో  తోటబావి వద్ద ఆదివారం రాత్రి 11.33 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. మొదట అర్చకులు అగ్నిగుండాలను దాటగా, తర్వాత ఆలయ అధికారులు, భక్తులు దాటుతూ గర్భగుడిలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమం తెల్లవారుజాము వరకు కొనసాగింది. సోమవారం ఉదయం ఆలయ గర్భగుడిలో ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. దీంతో బ్రహ్మోత్సవాల ఘట్టం పూర్తయ్యింది. వేడుకను తిలకించేందుకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 40 వేల మంది తరలివచ్చారు. ఈఓ బాలాజీ, చైర్మన్ భిక్షపతి, ప్రధానాఅర్చకులు మల్లికార్జున్, ధర్మకర్తలు మారుపల్లి శ్రీనివాస్, కందుకూరు సిద్ధిలింగం, సౌజన్య, గిరిధర్, రఘు పాల్గొన్నారు.

రూ.46 లక్షల ఆదాయం 

ఆలయానికి అగ్నిగుండాల వారం బుకింగ్ ఆదాయం రూ.45 లక్షల 94 వేల 636 వచ్చిందని అధికారులు తెలిపారు. పట్నాలు, బోనాల ద్వారా రూ.18 లక్షల 73 వేలు, లడ్డూ, పులిహోరాతో రూ.9 లక్షల 26 వేలు, వీవీఐపీ, విశిష్ట దర్శనం, శీఘ్ర దర్శనాల టికెట్లతో రూ.14 లక్షల 64 వేలు, పుట్టు వెంట్రుకల టికెట్లతో రూ.లక్ష 56 వేలు,  అతిథి గృహాలు,  ఎల్లమ్మ దేవాలయం, అన్నదానం, ఇతర బుకింగ్​లతో కలిపి రూ.45 లక్షల 94 వేల 636 ఆదాయం వచ్చింది.