నాలుగేండ్లుగా నత్తనడకన మల్లన్న ధర్మశాల పనులు

నాలుగేండ్లుగా నత్తనడకన మల్లన్న  ధర్మశాల పనులు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానానికి సంబంధించిన అద్దె గదులు దొరకక, వేల రూపాయలతో ప్రైవేటు గదులు తీసుకోలేక చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు నెలలపాటు జరిగే జాతర సమయంలో, వారాంతాల్లో భక్తులకు వసతి దొరకడం చాలా కష్టమవుతోంది. ఏటా రూ.15 కోట్ల ఆదాయం ఉన్న ఆలయంలో భక్తులకు సరిపడా గదులు అందుబాటులో లేవు. దాతల సహకారంతో నిర్మించిన 120  గదులు నిర్మించినా 40  గదులను దేవస్థానమే వివిధ కార్యాలయాలకు వాడుకుంటోంది. మిగతా 80  గదులు  భక్తులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో 2018లో కొమురవెల్లిలోని బండగుట్టపై 50 గదుల ధర్మశాల నిర్మాణ పనులు ప్రారంభించినా ఇంకా పూర్తికాలేదు. 

ధర్మశాల నిర్మాణ పనులు ఇలా.. 

అత్యాధునిక సౌకర్యాలతో జీ ప్లస్ టూ పద్ధతిలో ధర్మశాలను నిర్మించాలని నిర్ణయించారు.  దాదాపు రూ.11 కోట్లతో 50 గదుల ధర్మశాల నిర్మించాలని భావించారు. గదులు దొరకని భక్తులు పెద్ద  డార్మిటరీ హాల్స్ లోనే పట్నాలు, బోనాలు  నిర్వహించుకోవడంతో పాటు  పార్కింగ్ ప్లేస్ తో ప్లాన్ చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చినప్పుడు రూ.10 కోట్లను ప్రకటించారు. అయితే మొదట ధర్మశాలను ఎక్కడ నిర్మించాలనే విషయంపై తర్జన భర్జనలతోనే సమయం వృథా అయ్యింది. ఆలస్యంగా ధర్మశాల పనులు ప్రారంభమైనా నిధులు సరిపోవని ఇంజనీర్లు సూచించడంతో కమిషనర్ అనుమతితో దేవస్థానం నిధులు రూ.3.40 కోట్లు  వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఫైనల్​గా ధర్మశాల నిర్మాణ  పనులు చేపట్టినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగేండ్లలో సెకండ్ ఫ్లోర్ స్లాబ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో జాతర ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మల్లన్న ధర్మశాల నిర్మాణం పూర్తయ్యేదెన్నడో.. అందుబాటులోకి వచ్చేదెప్పుడోనని భక్తులు ఎదురు చూస్తున్నారు. ''

ఫిబ్రవరి లోగా కంప్లీట్​ చేస్తాం 

ధర్మశాల రెండు ఫ్లోర్​ల స్లాబ్ పనులు కంప్లీట్​అయ్యాయి. మిగతా పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేస్తాం. రోడ్డు నిర్మాణంతో పాటు బ్రిడ్జి, సైడ్ వాల్స్ ను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఏర్పడటం, డిజైన్లను మార్చడంతో పనులు ఆలస్యమయ్యాయి. 

- శ్రీనివాసరెడ్డి, డీఈఈ