
గజ్వేల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ లో ఉంటున్న దాదాపు పది వేల మంది మల్లన్నసాగర్ నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. అప్పుడు అధికారుల హామీపై వారంతా ఆగమేఘాలపై ఊర్లను ఖాళీ చేశారు. కాలనీలోకి వచ్చిన ఆరు నెలల్లో అన్ని వసతులు కల్పిస్తామన్న మాట నమ్మారు. కానీ ఏండ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ క్రమంలో వారు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : మల్లన్నసాగర్ నిర్మాణంతో ముంపునకు గురైన తొగుట, కొండపాక మండలాలకు చెందిన ఏడు గ్రామాల ప్రజలను గజ్వేల్ సమీపంలో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి దాదాపు ఏడాదిన్నర కింద తరలించారు. గజ్వేల్ పట్టణ సమీపంలోని సంగాపూర్, ముట్రాజ్ పల్లి సమీపంలో 600 ఎకరాలలో ఈ కాలనీని నిర్మించారు. డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్న వారికి గ్రామాల వారీగా కాలనీలో నిర్వాసితులకు ఇండ్లు కేటాయించి అప్పగించారు. ఓపెన్ ప్లాట్ల ఆప్షన్ పెట్టుకున్న వారికి ఆరునెలల్లో అన్ని సౌకర్యాలతో అందిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. కాలనీలో కనీస సౌకర్యాల కల్పనపై ఇచ్చిన హామీలు మరిచారు. కాలనీలోకి వచ్చిన మూడు నెలల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పినా ఇప్పటికీ ఏ ఒక్కరికీ పని ఇవ్వలేదు.
అసంపూర్తి నిర్మాణాలు
కాలనీలో నిర్వాసితుల కోసం విద్య, వైద్య రంగాలకు సంబంధించిన అనేక నిర్మాణాలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. మూడు పాఠశాలలు ఏర్పాటు చేసినా టాయిలెట్లు, కిచెన్ షెడ్లు లేవు. అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణంలో, విద్యుత్ దీపాల పనుల్లో జాప్యం కొనసాగుతోంది. డ్రైన్లు కూలిపోతున్నా రిపేర్లు చేయడం లేదు. వైకుంఠధామం లేక ఇబ్బందులు పడుతున్నారు.
పెండింగ్ లోనే పరిహారాలు..
పలువురు నిర్వాసితులకు పరిహారాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వివిధ కారణాలతో ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవడంతో ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.
ఓపెన్ ప్లాట్ల లోనూ సమస్యలు
నిర్వాసితులకు కేటాయించిన ఓపెన్ ప్లాట్లలోనూ ఇబ్బందులు ఉన్నాయి. గజ్వేల్ పట్టణ సమీపంలో దాదాపు 1000 మందికి ఓపెన్ ప్లాట్లను కేటాయించిన అధికారులు ఇప్పటికీ పొజిషన్ చూపలేదు. ఆరు నెలల కిందనే ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పొజిషన్ లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్లాట్లు కేటాయించిన స్థలాల విషయంలో వివాదాలు ఏర్పడుతుండటంతో కొందరు కోర్టును ఆశ్రయించారు.
ఆందోళన బాట..
ఏండ్లు గడుస్తున్నా తమ సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో నిర్వాసితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈవిషయమై ఇప్పటికే ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘట్ నిర్వాసితులు సమావేశాలు నిర్వహించుకున్నారు. ఇదిలా వుంటే ఇటీవల నిర్వాసితులు, ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లతో కలెక్టర్ స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. నిర్వాసితుల పెండింగ్ సమస్యలపై చర్చించి పరిష్కారానికి హామీ ఇచ్చినా ఎలాంటీ ప్రగతి లేదు.
మాట తప్పుతున్నారు..
గ్రామాలు ఖాళీ చేసేటప్పుడు అధికారులు ఇచ్చిన మాట తప్పుతున్నారు. చాలామందికి ప్యాకేజీలు, పరిహారాలు దక్కలేదు. ఉపాధి కల్పించలేదు. వైకుంఠధామం లేదు. సర్కార్ స్పందించాలి. మాకు న్యాయం చేయాలి.
- అల్లం మల్లేశం, ఎర్రవల్లి గ్రామం
ప్లాట్ల పొజిషన్ చూపట్లే..
మల్లన్న సాగర్ కోసం గ్రామాన్ని ఖాళీ చేసి రెండేండ్లు అవుతోంది. మాకు ఓపెన్ ప్లాట్లు ఇస్తామన్నారు. కానీ ఇంకా పొజిషన్ చూపలేదు. అధికారులు వెంటనే స్పందించి తమ ససమ్యలను పరిష్కరించాలి.
- పెద్ది బాల్కిషన్, వేములఘాట్
అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి..
మల్లన్న సాగర్ నిర్వాసితుల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వేములఘాట్ గ్రామస్తులకు కేటాయించిన ఓపెన్ ప్లాట్లపై కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లి స్టేటస్కో తేవటంతో ఇబ్బంది తలెత్తింది. పెండింగ్లో ఉన్న పరిహారాలు, ప్యాకేజీలు కూడా అందిస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు.
- అనంతరెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట