ఇతడు ఇన్నోవేటివ్ రైతుగా​ ఎలా మారాడంటే..

ఇతడు ఇన్నోవేటివ్ రైతుగా​ ఎలా మారాడంటే..
  • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి.. పొలంబాట పట్టి..

ఎవుసం దండగని కంపెనీల్ల జాబులెతుక్కునేటోళ్లు ఇప్పుడెక్కువయిన్రు. సదువకున్నోళ్లు ఎవుసం జేస్తున్నరంటే కొలువు రాక, చేసేది లేక ఇట్ల బతుకుతున్నరనుకునే రోజులియ్యి. చేయనీకి రెక్కలు, తాతలిచ్చిన భూములున్న ఎవుసం వద్దు..ఉద్యోగమే ముద్దని కోచింగ్​ సెంటర్లల్ల కుస్తీలు పట్టెటోళ్లే మోపైతున్నరు. లోకం ఇట్లుంటె, అయిదంకెల జీతం వదులుకోని ఎవుసం చేద్దమని పట్నం వదిలి పల్లెకొచ్చిండు మల్లికార్జున్!. మొదాల ఇబ్బందిపడ్డడు. దండుగలొచ్చినయ్​. ఆ తర్వాత పంట చేలో పండగే! లాభాలేంది.. అవార్డులు గూడ వచ్చినయ్​. ఇండియాకే ‘ఇన్నొవేటివ్​ ఫార్మర్​’ మన మల్లికార్జున్​.

ఆరేళ్ల కింద.. పెద్ద కుర్మపల్లి  (కరీంనగర్​ జిల్లా, చొప్పదండి మండలం) చుట్టుముట్టు ఊళ్లల ‘మావురం మల్లికార్జున్​ రెడ్డి తెలుసా?’ అంటే ‘ఆయనెవలో మాకేం ఎర్కని’ అనేటోళ్లు. అప్పుడా పిలగాడు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​. ఏదో కాలేజీలో ​ సదివిండు. ఉద్యోగం చేయనీకి ఊరు దాటి పోయిండు. ఊరందరికీ తెలిసేంత ఏముంది. పక్క ఊరోళ్లకి ఇంకెట్ల తెలస్తది?

ఇప్పుడు.. ‘మావురం మల్లికార్జున్​ మా ఊరోడే’నని పెద్ద కుర్మపల్లి జనమంత గొప్పగ చెప్పుకుంటున్నరు. ఆ పిలగాడు మా పక్క ఊరోడేనని చుట్టమట్టు ఊర్ల జనం గూడ చెప్పుకుంటున్నరు. సాఫ్ట్​వేర్​ కొలువు జేస్త పైసలు సంపాదిస్తడని కాదు. సాఫ్ట్​వేర్​ వదిలేసి, ఎవుసం చేసుకుంట ఊరికే కాదు తెలంగాణకే మంచి పేరు తెచ్చిండని చెప్పుకుంటున్నరు. ‘సదువుకున్నోడయితేనేం.. కష్టం జేయనీకి నామోషీ పడడు. ఎవుసం ఎట్ల లాభమొస్తదో అట్ల చేసిండు. అందరికీ నేర్పుతాండని చెప్పుకుంటన్నరు. 35 ఏళ్ల మల్లికార్జున్​ కష్టం జూస్తే ఎన్ని మాటలు జెప్పినా ఒక్క ఆచరణకు సరితూగవనిపిస్తది.

ఇద్దరు ఒకటై చేయి కలిపితే..

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ మల్లికార్జున్​ సిమాంటిక్​ కంపెనీల 2003 నుంచి జాబ్​ చేస్తన్నడు. సంధ్యారాణితో 2007ల పెండ్లి చేసినరు. ఆమె ఎంబీఏ చదివింది. ఆమె గూడ ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీల జాబ్​ చేస్తంది. ఇద్దరికీ అయిదంకెల జీతాలే! ‘ఆహా! ఏమి లైఫ్​’ అనుకోలే వాళ్లు. ‘లైఫ్​లో ఈ ఉరుకులు పరుగులు ఏంది? పొల్యూషన్​, వర్క్​ టెన్షన్, కల్తీ ఫుడ్​.. అవసరమా?’ అనుకున్నరు. పైసల కోసం ఇన్నింటిని భరించొద్దని ప్రశాంతమైన లైఫ్​, పొల్యూషన్​లేని గాలి, కల్తీ లేని ఫుడ్​, శ్రమ తప్ప స్ర్టెస్​లేని అగ్రికల్చర్​ బెస్ట్​ అనుకున్నరు. ఇద్దరూ ఓ మాటమీదకొచ్చిన్రు. మల్లికార్జున్​ వాళ్ల బాపు లక్ష్మారెడ్డికి ఈ ముచ్చట జెప్పిండు. ఒప్పించిండు. ఎవుసం చేయాల్నని 2014ల ఊరికి వచ్చిన్రు.

మావురం లక్ష్మారెడ్డి, మణెమ్మకు 12 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇంకో అయిదెకరాలు కౌలుకు తీస్కోని ఎవుసం మొదలువెట్టిండు. ఆర్గానిక్​ పద్ధతిల ఎవుసం చేసిండు. డ్రిప్​ ఇరిగేషన్​తో చేస్తున్న ఆ ఎవుసం ఎలుకల దెబ్బకి దండగలపాలయింది. ఇట్ల కాదని రెండో పంటకి భూసార పరీక్ష జేయించిండు. అగ్రికల్చర్​ సైంటిస్టుల్ని కలిసి ఆ భూమికి తగిన పంట, ఏ వంగడం అయితే బాగుంటదని తెలుసుకున్నడు. అట్ల రెండో పంటల ఏడు రకాల వరి వంగడాలని సాగుజేసిండు. ఆ ఊరి రైతులందరికంటే మల్లికార్జున పొలంలనే ఎక్కువ పంట పండింది. ఆరోజు వాళ్లింట పండగే!

పాత సాగు పద్ధతిలో కొత్త వంగడం

అప్పటి సంది మల్లికార్జున్​ ఎవుసంల ఎనక్కి తిరిగి సూడలె. పట్టింది బంగారమన్నట్టు ఏది పండించిన లాభమొస్తుండె. చత్తీస్​గఢ్​​ యూనివర్సిటీకి పోయి జింక్​ రైస్​ సాగు గురించి తెలుసుకోని వచ్చిండు. తన పొలంల దానిని సాగు జేసిండు. మల్లికార్జున్​ ఇప్పుడు వరి, వసకొమ్ము (ఎకరంన్నర), అల్లం (10గుంటలు), మిర్చి (10గుంటలు), పల్లీ, పెసర, కొత్తిమీర, ఆకుకూరలు, పండ్ల చెట్లు, పప్పులు, పొద్దు తిరుగుడు సాగు చేస్తున్నడు. అయితే వీటిలో వసకొమ్ము సాగు మీద అందరూ ఇంట్రెస్ట్​ చూపిస్తున్నరు. ఒకప్పుడు పసి పిల్లలకు మాటలు బాగా రావాలని వస పోసేది. ఆ వసలో ఇంకెన్నో మెడిసినల్​ బెనిఫిట్స్​ ఉన్నయి. వాటి మీద పరిశోధన చేస్తున్న ఆయుర్వేదిక్​ యూనివర్సిటీతో కలిసి వసకొమ్ము సాగు చేస్తున్నడు. ఇది 9 నెలల పంట కాలం. దిగుబడి ఎకరానికి 25 క్వింటాళ్లు వస్తున్నదంట. ధర క్వింటా 9 వేల రూపాయలు. ఆస్తమా, టీబీ రోగులకు ఆయుర్వేద మెడిసిన్​గా ఈ వసకొమ్మును వాడుతున్నరని, దీని సాగు తేలిక, లాభం కూడా ఎక్కువేనని మల్లికార్జున్​ చెబుతున్నడు. వాణిజ్య పంటల్ని అందరిలెక్క ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా, సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులతోనే సాగు  చేస్తున్నానని, ఇట్లనే పెట్టుబడి తక్కువని మల్లికార్జున్​ చెబుతున్నడు.

చేనుతో అనుబంధం

ఎవుసంతోపాటు వ్యవసాయ బావి, కుండీలలో చేపలు పెంచుతున్నడు. పశుపోషణ తనకు ఇంట్రెస్ట్​ ఉంది. ఇంటికి దగ్గర్లనే ఒక షెడ్ వేసి, దేశీ ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు పెంచుతున్నడు. వాటి పేడ, పెంటని వేస్ట్​ కాకుండా సేంద్రియ ఎరువుగా మారుస్తున్నడు.  పశువుల కోసం పెంచి మిగిలిపోయిన గడ్డిని డీ కంపోస్ట్​ చేయడం, అగ్రికల్చర్​ వేస్ట్​ని తగులబెట్టకుండా డీకంపోజ్ చేసి భూమి సారాన్ని పెంచుకునేందుకు సేంద్రియ ఎరువుగా వాడుతున్నడు.

సాగుబడి

తన అనుభవాలను అందరికీ చెప్పాల్నని అగ్రికల్చర్​ ఆఫీసర్స్​, అగ్రికల్చర్​ యూనివర్సిటీ ప్రొఫెసర్స్​ మల్లికార్జున్​ని ఎంకరేజ్​ చేస్తున్నరు. సైంటిస్టులు మల్లికార్జున్​ని జమ్మికుంట కృషి విజ్ఙాన కేంద్రం సలహాదారుగా నియమించినరు.
అందుల స్టడీ చేస్తున్న స్టూడెంట్స్​కి సాగు పాఠాలు చెబుతనే, రైతులతో అనుభవాలు పంచుకుంటున్నడు. ఎట్ల చేస్తే లాభాలొస్తయో? ఎట్ల పట్టుబడి తగ్గించు కోవాల్నో రైతులుకు చెబుతున్నడు. మల్లికార్జున్​ని ‘ఆత్మ’ విభాగంలో సభ్యుడిగా నియమించినరు. మల్లికార్జున్​ ఇంకొంతమంది రైతులకు కొత్త దారి చూపిస్తే ఎవసం దండుగ కాదు. పండుగని ఊళ్లన్నీ అనుకునే రోజులొస్తయ్​.

ప్రయోగాలతోనే మేలు

నాతోపాటే ఇంకెంతో మందిని సేంద్రియ పద్ధతిలోకి తీసుకొస్తున్న. వాళ్ల కష్టానికి తగ్గ లాభం వచ్చేట్టు చేస్తున్న. ఇట్ల చేస్తున్నందుకు నాకు సంతోషంగ ఉంది. నేను ప్రాక్టీస్​ చేసే సాగు పద్ధతులు జూసి చానా మంది రైతులు మారినరు. ఇప్పుడు మా ఊళ్లనే 300 ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతున్నది. నాకు ఎంతో గర్వంగా ఉన్నది. ‘సమీకృత వ్యవసాయం (ఇంటిగ్రేటెడ్​ అగ్రికల్చర్​), కొత్త విధానాలను పాటిస్తేనే ఎవుసంల మంచి దిగుబడి వస్తది, మనకు లాభాలొస్తయ్​.– మావురం మల్లికార్జున్​ రెడ్డి

ఐడియాలకు అవార్డులు

అగ్రికల్చర్​లో కొత్త ఐడియాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, సమీకృత వ్యవసాయంతో ఎక్కువ లాభాలు సాధించే రైతుల్ని ఎంకరేజ్​చేసేందుకు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎఆర్ఐ)  ఏటా ‘ఇన్నొవేటివ్ ఫార్మర్’ అవార్డుని ఇస్తుంది. ‘ఇన్నొవేటివ్​ ఫార్మర్​ – 2021’కి తెలంగాణ స్టేట్ నుంచి మల్లికార్జున్​ రెడ్డి సెలక్ట్​ అయిండు. అట్లనే ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ అగ్రికల్చర్​ రీసెర్చ్​ (ఐసీఏఆర్) ఏటా ఇచ్చే జగ్జీవన్​రామ్​ అభివన్​ కిసాన్​ పురస్కార్’ కి నామినేట్​ అయిండు. ఈ ఆరేండ్ల కృషిలో మల్లికార్జున్​ ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నడు. జనవరి26న జిల్లా కలెక్టర్ మల్లికార్జున్​ రెడ్డికి ఉత్తమ రైతు అవార్డు అందించారు. ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం, చత్తీస్​గఢ్​ యూనివర్శిటీ నుంచి ‘ఉత్తమ రైతు’ అవార్డులు​ అందుకున్నడు.

ఇవి కూడా చదవండి

మొక్కకు ఈ బాక్సు పెడితే.. నెలకు రెండు సార్లు నీళ్లు పోస్తే చాలు

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు