మాన్యుఫ్యాక్చరింగ్ హబ్​గా భారత్​ను మారస్తాం:​ మల్లికార్జున్ ఖర్గే

మాన్యుఫ్యాక్చరింగ్ హబ్​గా భారత్​ను మారస్తాం:​ మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ, సమస్తిపూర్, పాట్నా:  ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని మాన్యుఫ్యాక్చరింగ్ హబ్​గా మారుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్  ఖర్గే అన్నారు. వచ్చే ఐదేండ్లలో జీడీపీని 14% నుంచి 20 శాతానికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. భారత్​లో తయారీపై ట్విటర్​లో ఆయన పలు హామీలు ఇచ్చారు. బీజేపీ హయాంలో కన్నా కాంగ్రెస్  హయాంలోనే దేశ జీడీపీ ఎక్కువగా నమోదైందన్నారు. 

కానీ, పదేండ్ల బీజేపీ పాలనలో మ్యానుఫ్యాక్చరింగ్  వాటా 14 శాతం వద్దే స్తంభించిందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశానికి, ప్రపంచానికి వస్తుసేవలు అందించేలా ఇండియాను మాన్యుఫ్యాక్చరింగ్  పవర్ హౌస్​గా మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునేందుకు నమ్మకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే తమ పార్టీ ప్రాధాన్యమని చెప్పారు.

 ‘1991లో అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం ఇండస్ట్రియల్  లైసెన్సింగ్  అండ్  కంట్రోల్  విధానాన్ని రద్దుచేసింది. ప్రస్తుతం ఉన్న వ్యాపార విధానాలు, నిబంధనలపై మేము సమగ్రమైన రివ్యూ చేస్తాం. వర్తకం, వ్యాపారాలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు అవసరమైన మార్పులు చేస్తాం. స్టీల్, మెటల్స్, గార్మెంట్స్, టెక్స్ టైల్స్, సిమెంట్, ఆటోమొబైల్స్, ఎలక్టానిక్  గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్  గూడ్స్, పెట్రోలియం ఉత్పత్తులు, గనులు, క్రిటికల్  మినరల్స్  వంటి పరిశ్రమల్లో ఇండియా నాయకత్వం వహించే స్థాయికి చేరుకునేలా చేస్తాం’ అని ఖర్గే పేర్కొన్నారు.

ఆగిపోయిన ప్రాజెక్టులను ముందుకు నడుపుతం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్  ఇండియా డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 60% భారీ ప్రాజెక్టులు ఆగిపోయాయని మల్లికార్జున్  ఖర్గే అన్నారు. ప్రైవేట్  సెక్టార్  సాయంతో ఆ ప్రాజెక్టులను బతికిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రొడక్షన్  లింక్డ్  ఇన్సెంటివ్స్  స్కీమ్ ను సంస్కరిస్తామని, దానితో ఆ రంగాల్లో దేశాన్ని ప్రపంచంలోని టాప్ 5 ఉత్పత్తుల్లో నిలబెడతామని చెప్పారు. అలాగే కార్పొరేట్లు ట్యాక్స్ క్రెడిట్లు గెలిచేందుకు కొత్తగా ఎంప్లాయ్​మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్​ను ప్రవేశపెడతామన్నారు. అన్ని వ్యాపారాలకు సమాన స్థాయిలో అవకాశాలు కల్పిస్తామని, గుత్తాధిపత్యానికి తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు.

అంబానీ, అదానీలు డబ్బు పంపకంపై..

కాంగ్రెస్​కు అంబానీ, అదానీలు బ్లాక్ మనీ పంపుతుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రధాని మోదీపై మల్లికార్జున్  ఖర్గే మండిపడ్డారు. బిహార్​లోని సమస్తిపూర్, పాట్నాలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘అంబానీ, అదానీపై మేము మాట్లాడట్లేదని ప్రధాని అంటున్నారు. వారు మా పార్టీకి నల్లధనం పంపితే మీరు(మోదీ) ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అని ఖర్గే నిలదీశారు.