చాపకింద నీరులా ఇండియా కూటమి హవా: ఖర్గే

చాపకింద నీరులా ఇండియా కూటమి హవా: ఖర్గే
  •     ఓటమి తప్పదని మోదీ భయపడుతున్నరు: ఖర్గే  
  •     మోదీ.. 2 కోట్ల ఉద్యోగాలిచ్చారా? 
  •     రైతుల ఆదాయం రెట్టింపు చేశారా?
  •     రాముడిపై ఒట్టేసి చెప్పాలని సవాల్

కలబుర్గి:  లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి హవా కొనసాగుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కంటికి కనిపించకుండా చాపకింద నీరులా ప్రతిపక్ష కూటమికి పెరుగుతున్న ఆదరణను చూసి భయపడుతున్నందుకే ప్రధాని నరేంద్ర మోదీ దేశమంతటా విస్తృతంగా పర్యటిస్తూ సభలు పెడుతున్నారన్నారు. శుక్రవారం కర్నాటకలోని కలబుర్గిలో ఎంపీగా పోటీ చేస్తున్న తన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి తరఫున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీపై విమర్శలు గుప్పించారు. 

‘‘మోదీజీ.. విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్​లో రూ.15 లక్షలు వేస్తానన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవన్నీ చేశామని మీరు అయోధ్యలోని రాముడి విగ్రహంపై ఒట్టేసి చెప్పగలరా?” అని సవాల్ చేశారు. మోదీ ఒకవైపు దేవుడి పేరును జపిస్తూ, మరోవైపు ధరలను పెంచి పేదలను ఇబ్బందులకు గురి చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఉపాధి హామీ పథకం వల్లే ఇప్పుడు మన దేశంలో పేదలు మనుగడ సాగించగల్గుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ, ఐటీ, విజిలెన్స్ దాడులతో మోదీ బెదిరిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. 

‘‘మా పార్టీలో ఉన్నప్పుడు అవినీతిపరులైన నేతలు బీజేపీలోకి వెళ్లగానే ఎలా క్లీన్ అవుతారు? అందుకే నేను తరచూ మోదీ, అమిత్ షా వద్ద వాషింగ్ మెషీన్ ఉందని, అందులో అవినీతి నేతలను వేయగానే క్లీన్ అవుతారని అంటుంటా” అని ఎద్దేవా చేశారు. తన చుట్టే అవినీతిపరులను పెట్టుకుని మోదీ అవినీతిని అంతం చేస్తానని అంటున్నారని విమర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్​లలో ప్రభుత్వాలను కూల్చారని.. మోదీ, అమిత్ షా పాటించే ప్రజాస్వామ్యం ఇదేనన్నారు. ప్రధాని ప్రతి చోటా ‘మోదీ గ్యారంటీ’ అంటున్నారు కానీ ఆయన కాంగ్రెస్ గ్యారంటీలను కాపీ కొడుతున్నారన్నారు.

కలబుర్గి బరిలోకి ఖర్గే అల్లుడు.. 

ఖర్గే సొంత జిల్లా అయిన గుల్బర్గాలోని కలబుర్గి నుంచి 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2019లో ఓడిపోయారు. 2020 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, కలబుర్గి నుంచి తన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలోకి దింపారు.