
బెంగళూరు: కర్నాటక, గదగ్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘మోడీ.. విష సర్పం లాంటి వ్యక్తి. విషమా కాదా? అని రుచి చూసేందుకు ప్రయత్నిస్తే.. మీరు చనిపోతారు” అని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఖర్గే వివరణ ఇచ్చారు. “బీజేపీ పాము లాంటిది. మీరు రుచి చూడాలని ప్రయత్నిస్తే.. మీరు చనిపోతారు. నేను ఆయన (ప్రధాని మోడీ) గురించి మాట్లాడలేదు. నేను వ్యక్తిగత ప్రకటనలు చేయను. వారి భావజాలం పాము లాంటిదని నా ఉద్దేశం. రుచి చూడటానికి ప్రయత్నిస్తే మాత్రం చావు తప్పదు” అని హెచ్చరించారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఖర్గే క్షమాపణలు చెప్పారు. తన స్టేట్‌మెంట్ ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నానని అన్నారు.
40% సర్కారును ప్రజలు ముగిస్తారు: కాంగ్రెస్
నిజమైన హామీలను కాంగ్రెస్ ఇవ్వదంటూ ప్రధాని చేసిన విమర్శలపై హస్తం పార్టీ స్పందించింది. మే 10న రాష్ట్రంలోని బీజేపీ 40 శాతం కమీషన్ సర్కారును ప్రజలు గ్యారెంటీగా ముగిస్తారని వ్యాఖ్యానించింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో మాదిరే తాము ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. ‘‘అమిత్ షా, యోగి తర్వాత ఇప్పుడు మోడీ వంతు. వైరాగ్యం, నిరాశతోనే వాళ్లు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిన పథకాల లిస్టును ట్వీట్ చేశారు.
జాలర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్: రాహుల్
కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే.. జాలర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మంగళూరు జిల్లా ఉడుపిలో భారీ ర్యాలీ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ‘‘మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించేలా చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నా” అని చెప్పారు. జాలర్లకు రూ.లక్ష దాకా వడ్డీ లేని రుణం ఇస్తామని రాహుల్ ప్రకటించారు. లీటర్ డీజిల్‌కు రూ.25 సబ్సిడీ ఇస్తామని, గరిష్టంగా 500 లీటర్ల వరకు ఇది వర్తిస్తుందన్నారు.
‘అల్లర్ల’ కామెంట్లపై.. అమిత్ షాపై కాంగ్రెస్ ఫిర్యాదు
కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఈ నెల 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్లపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు జరుగుతాయి” అన్న ఆయన కామెంట్లపై కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ రణదీప్ సూర్జేవాలా, స్టేట్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర గురువారం బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. పలువురు బీజేపీ నేతలు, ఎన్నికల ర్యాలీ నిర్వాహకుల పేర్లనూ కంప్లయింట్ లో రాశారు. ‘‘అమిత్ షా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే ఆ కామెంట్లు చేశారు” అని పేర్కొన్నారు. .