పెండింగ్‌‌ ప్రాజెక్టులను రెండుమూడేండ్లలో పూర్తి చేస్తాం : భట్టి విక్రమార్క

  • ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

వనపర్తి, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌‌లో ఉన్న ప్రాజెక్టులను రెండుమూడేండ్లలో పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. గురువారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దేశంలో మొదటిసారిగా ఫ్రీ కరెంట్‌‌ ఇచ్చింది కాంగ్రెస్‌‌ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రతి నెల విద్యుత్‌‌ శాఖకు రూ. రూ.12 వేల కోట్లు కడుతున్నామని, పదేండ్లుగా వదిలేసిన పంట నష్టాన్ని సైతం మంజూరు చేస్తున్నామన్నారు.

తాము ప్రజల కోసం 18 గంటల పాటు పనిచేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు ఉన్న భూములకు కాకుండా సాగు భూములు, అర్హులైన రైతులకే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే రూ. 12 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. 20 వేల మెగావాట్ల థర్మల్‌‌ విద్యుత్‌‌ వాడకాన్ని తగ్గించి గ్రీన్‌‌ ఎనర్జీ కింద కొత్త పథకాన్ని తీసుకురానున్నామని, మిగులు కరెంటును ఇతర రాష్ట్రాలకు ఇచ్చేలా చూస్తామన్నారు.

గత ప్రభుత్వం నిరుపేదల గురించి కాకుండా తమ ఎమ్మెల్యేలు, లీడర్ల గురించే పట్టించుకుందని మండిపడ్డారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌‌కర్నూల్‌‌ ఎంపీ మల్లు రవి, ప్లానింగ్‌‌ బోర్డు వైస్‌‌ చైర్మన్‌‌ చిన్నారెడ్డి, స్పో్ర్ట్స్‌‌ చైర్మన్‌‌ శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌‌ విష్ణువర్ధన్‌‌రెడ్డి పాల్గొన్నారు.