డిమాండ్లకు ఓకే సమ్మె ఆపండి: మమతా బెనర్జీ

డిమాండ్లకు ఓకే సమ్మె ఆపండి: మమతా బెనర్జీ

కోల్‌‌కతా/న్యూఢిల్లీపశ్చిమ బెంగాల్​లో డాక్టర్ల సమ్మె ఆరో రోజుకు చేరింది. డాక్టర్లపై దాడులను నిరసిస్తూ బెంగాల్​తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ వార్డుల్లో మినహా ఇతర విభాగాల్లో మెడికల్‌ సర్వీసులు నిలిపేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ల ఆందోళనను విరమింపజేసేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ ముందుకొచ్చినా.. డాక్టర్లు తిరస్కరించారు. ఆందోళనను బ్రేక్​చేయడానికి సీఎం కుట్ర పన్నారని వారు ఆరోపించారు. చర్చలకు రావాలంటూ సీఎం శనివారం మరోసారి డాక్టర్లను ఆహ్వానించారు. రెండోసారి కూడా ఈ ప్రతిపాదనను డాక్టర్లు తోసిపుచ్చారు. దీంతో సీఎం మమతా బెనర్జీ శనివారం సాయంత్రం ప్రెస్​మీట్​లో డాక్టర్ల సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్ఆర్ఎస్ ​హాస్పిటల్ ఘటన దురదృష్టకరమని చెప్పారు. రోగి బంధువుల దాడిలో గాయపడి, ప్రైవేటు హాస్పిటల్​లో చేరిన డాక్టర్​ చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్ల న్యాయసమ్మతమైన డిమాండ్లను అంగీకరిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో వైద్యసేవల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.  ట్రీట్‌మెంట్‌ అందక వేలాది మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే డ్యూటీల్లో చేరాలని కోరారు.

సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఆందోళనకారులు ప్రభుత్వానికి ఆరు కండిషన్లు పెట్టారు. ఆందోళనకు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్‌‌పై బేషరతుగా మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పడం, విధుల్లో ఉన్న డాక్టర్‌‌పై దాడిచేసిన రోగి బంధువులపై చర్యలు తీసుకోవడంలాంటి కండిషన్లను పెట్టారు. ఎన్‌‌ఆర్‌‌ఎస్‌‌ మెడికల్‌‌ కాలేజీ, హస్పిటల్‌‌కు వచ్చి తాను ఎస్‌‌ఎస్‌‌కేఎం హాస్పిటల్‌‌ దగ్గర చేసిన ప్రకటనపై బేషరతుగా క్షమాపణ చేప్పాల్సిందేనని జూనియర్‌‌ డాక్టర్ల జాయింట్ ఫోరమ్‌‌ మమతను డిమాండ్‌‌ చేస్తోంది. కోల్‌‌కతా ఎస్‌‌ఎస్‌‌కేఎం హాస్పిటల్‌‌కు వెళ్లినప్పుడు నిరసనలుచేస్తున్న డాక్టర్లు తనను దూషించారని, అడ్డుకున్నారని సీఎం చెప్పారు. డాక్టర్ల ఆందోళన వెనక ‘బయటివ్యక్తుల’తోపాటు  సీపీఎం, బీజేపీ  కూడా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.

కేంద్ర మంత్రిని కలిసిన ఐఎంఏ సభ్యులు

డాక్టర్ల సమ్మెపై ఇండియన్‌‌ మెడికల్‌‌ అసోసియేషన్‌‌(ఐఎంఏ) సభ్యులు శనివారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌‌ను కలిశారు. సోమవారం దేశవ్యాప్త సమ్మెకు ఐఎంఏ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇలాంటి విధ్వంసకర సంఘటనలు జరగకుండా కేంద్రం ఒక చట్టం తీసుకురావాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌‌ షా ను కోరతామని కూడా ఐఎంఏ సభ్యులు చెప్పారు. దేశరాజధానిలో 15 హాస్పిటల్స్‌‌లో పనిచేస్తున్న డాక్టర్లు శనివారం కూడా ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు  బెంగాల్‌‌ సర్కార్‌‌కు 48 గంటల అల్టిమేటం ఇచ్చామని,  అప్పట్లోగా  సమస్య పరిష్కారం కాకుంటే  దేశంలోని అన్ని ఎయిమ్స్‌‌ల్లో నిరవధిక సమ్మె చేస్తామని ఎయిమ్స్‌‌ రెసిడెంట్‌‌ డాక్టర్స్ అసోషియేషన్‌‌  తేల్చిచెప్పింది. దేశంలోని అన్ని గవర్నమెంట్‌‌ హాస్పిటల్స్‌‌లో పనిచేసే డాక్టర్లకు సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ఫైల్‌‌ అయిన పబ్లిక్‌‌ ఇంటరెస్ట్‌‌ లిటిగేషన్‌‌(పిల్‌‌)ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.  ఇలాంటి  పిల్  కోల్ కతా హైకోర్టులోనూ దాఖలైంది. దీనిపై వారంరోజుల్లో సమాధానం చెప్పాలని హైకోర్ట్‌‌ బెంగాల్‌‌ సర్కార్‌‌ను ఆదేశించింది.

రిపోర్టు కోరిన కేంద్ర హోంశాఖ

డాక్టర్లు, హెల్త్​కేర్​ప్రొఫెషనల్స్, మెడికల్​అసోసియేషన్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో డాక్టర్ల సమ్మెకు సంబంధించి అర్జెంటుగా రిపోర్ట్​పంపించాలంటూ మమతా బెనర్జీ సర్కారును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. డాక్టర్లపై దాడులను అడ్డుకోవడానికి
అత్యవసరంగా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి హర్షవర్ధన్​అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాశారు.