291 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించిన మమత

291 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించిన మమత
  • నందిగ్రామ్ నుంచి మమత పోటీ
  • 291 మంది అభ్యర్థుల లిస్టు
  • 80 ఏండ్లు దాటినోళ్లకు నో టికెట్
  • సినీనటులకు అవకాశం
  • మిత్రపక్షాలకు మూడు స్థానాలు

న్యూఢిల్లీ, వెలుగు: వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ నందిగ్రామ్​ నుంచి పోటీ చేయనున్నారు. నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి బీజేపీలో చేరడంతో ఆమె ఈ నియోజకవర్గాన్ని చాలెంజ్​గా తీసుకున్నారు. శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎలక్షన్ ప్యానెల్ మీటింగ్ జరిగింది. తర్వాత మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 291 క్యాండిడేట్ల లిస్టును మమతా బెనర్జీ  రిలీజ్ చేశారు. మిగిలిన డార్జిలింగ్, కుర్స్వాన్, కలింపాంగ్ సీట్లను మిత్రపక్షాలకు వదిలేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..’ ఇచ్చిన మాట ప్రకారం నేను నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నా. భవానీపూర్ నుంచి సొభందేబ్ చట్టోపధ్యాయ్ పోటీ చేస్తారు. ఇది స్మైలీ ఎలక్షన్. సులువుగా గెలుస్తాం. ప్రజల ఆశీర్వాదం కోరుతున్నా. నాపై నమ్మకం ఉంచాలని మా మాటీ మానుష్​ను అప్పీల్ చేస్తున్నా’ అని అన్నారు.  ఈ నెల 9న నందిగ్రామ్ కు వెళ్తానని, 10న కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని మమత జనవరిలోనే ప్రకటించారు. భవానీపూర్ ఓటర్లు తన నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరారు.

50 మంది మహిళలు, 42 మంది మైనార్టీలు

291 మంది క్యాండిడేట్ల లిస్టు లో మమతా బెనర్జీ మహిళలకు పెద్దపీట వేశారు. 50 మంది మహిళలకు పార్టీ టికెట్ ఇచ్చారు. 35 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలకు అవకాశం కల్పించారు. 80 ఏండ్లు పైబడన వారికి టికెట్ ఇవ్వలేదని మమతా చెప్పారు. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు.  ఆరుగురు యాక్టర్లు, డైరెక్టర్లకు అవకాశం కల్పించారు.

మమతను ఓడిస్త: సువేందు అధికారి

పార్టీ తనకు నందిగ్రామ్ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తే మమతా బెనర్జీని 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. అయితే మమతపై ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ప్రధాని ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుంచి  జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.