గత ఐదేళ్లలో ‘సూపర్ ఎమర్జెన్సీ’

గత ఐదేళ్లలో ‘సూపర్ ఎమర్జెన్సీ’

కోల్ కతా: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గడిచిన ఐదేళ్ల బీజేపీ సర్కారు పాలనను సూపర్ ఎమర్జెన్సీగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1975 ఎమర్జెన్సీకి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మమతా బెనర్జీ మంగళవారం ట్వీట్ చేశారు. ‘ఇవాళ 1975 ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు. గడిచిన ఐదేళ్లలో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ అమలులో ఉంది. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలను కాపాడుకునేందుకు పోరాడాలి’ అని పోస్ట్ చేశారు.

మమత ట్వీట్ కు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ లోని పరిస్థితులు చూస్తే ఎమర్జెన్సీకి ఏం తక్కువ లేవన్నారు. “మమత పాలిస్తున్న తీరు చూస్తుంటే ఎమర్జెన్సీకి తక్కువ కాదు. ఆమె పాలన సరిగా లేదు. అక్కడ ఎక్కువ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ సర్కారు చిత్తశుద్ధితో ఉంది’ అని అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బెంగాల్ లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. గురువార భట్పారా జిల్లాలో ఇద్దరు చనిపోగా, ముగ్గురికి గాయాలయ్యాయి. బ్యారక్ పూర్ ఘటన వెనుక తృణమూల్ గూండాలు, పోలీసులు ఉన్నారని బీజేపీ నేత అర్జున్ సింగ్ అన్నారు. నార్త్ 24 పరగణ జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల హత్యపై బెంగాల్ బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేసింది.

అల్లర్ల ద్వారా తన సర్కారును పడగొట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేసిన మమత మే 30న మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి, జూన్ 15న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. బెంగాల్ ను గుజరాత్ గా మార్చాలని చూస్తున్నారంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు.  బెంగాల్ లో శాంతి భద్రతలు లేవని, ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ నేత ముకుల్ రాయ్  ఫిర్యాదు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి సెల్యూట్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

వెస్ట్ బంగ్లాదేశ్ సృష్టించాలని అనుకుంటున్నారు

బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను అనుమతిస్తూ వెస్ట్ బంగ్లాదేశ్ సృష్టించాలని మమత సర్కారు ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్   బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మమతపై నిప్పులు చెరిగారు. వెస్ట్ బెంగాల్ లో శాంతి భద్రతలు లేవన్నారు. “వెస్ట్ బెంగాల్ సీఎం ప్రధాని కావాలని ఆసక్తి చూపుతున్నారు. బెంగాల్, బంగ్లాదేశ్ ను ఒక్కటి చేసి వెస్ట్ బంగ్లాదేశ్ సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఇండియా నుంచి బెంగాల్ ను వేరు చేసేందుకు కుట్ర జరుగుతోంది” అని ఆరోపించారు. జై శ్రీరామ్ అనేది మన సొంత నినాదం అయితే.. జై బంగ్లా అనేది బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న నినాదమని ఆయన అన్నారు.