200 సీట్లు గెలవండి చూద్దాం! : మమతా బెనర్జీ

200 సీట్లు గెలవండి చూద్దాం! : మమతా బెనర్జీ
  • బీజేపీకి మమతా బెనర్జీ సవాల్

కృష్ణానగర్(బెంగాల్): వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 ఎంపీ స్థానాలు గెలిచేంత సీన్ లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కనీసం 200 సీట్లు గెలిచి చూపించండి అని ఆ పార్టీకి సవాల్ విసిరారు. ఆదివారం బెంగాల్​లోని కృష్ణానగర్ సెగ్మెంట్​లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) బెంగాల్​లో అనుమతించే ప్రసక్తే లేదని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

సీఏఏ కోసం దరఖాస్తు చేసుకున్నోళ్లందరినీ విదేశీయుల కింద లెక్కగడతారని ఆరోపించారు. కాబట్టి, ఎవరూ అప్లికేషన్ చేయొద్దని ప్రజలను కోరారు. ఇక్కడి స్థానికులపై ఫారినర్లుగా ముద్రవేయడాన్ని తాను ఎన్నటికీ అంగీకరించబోనని, ఆల్రెడీ సిటిజన్​షిప్ ఉన్నోళ్ల పౌరసత్వాన్ని లాక్కునే సీఏఏను ఒప్పుకోనని చెప్పారు. సీఏఏపై ప్రధాని మోదీ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. చట్టబద్ధంగా మనదేశ సిటిజన్​షిప్ ఉన్నోళ్లను విదేశీయులుగా మార్చే కుట్ర సీఏఏ పేరుతో చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘సీఏఏ అనేది ఒక ఉచ్చు లాంటిది. కేంద్ర సర్కారు తప్పుడు హామీలు నమ్మి ఆ ఉచ్చులో పడిపోకండి. దరఖాస్తు చేశారంటే ఐదేండ్లు ఫారినర్లుగా మారిపోతారు” అని మమతా బెనర్జీ చెప్పారు.