
వెలుగు: జవాన్ల మృతదేహాలతో ప్రధాని మోడీ రాజకీయం చేస్తున్నారని, ఇదంతా ‘లోక్సభ’ కోసమేనని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నియంతృత్వ మోడీని సాగనంపాలని సోమవారం జరిగిన టీఎంసీ కోర్ కమిటీ భేటీలో పిలుపునిచ్చారు. ‘జవాన్లపై టెర్రరిస్టు దాడులు జరుగుతాయని ఇంటలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించినా రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? జవాన్లను పొట్టనపెట్టుకున్నది ముమ్మాటికీ కేంద్రమే. ఎన్నికలకు ముందు దేశంలో యుద్ధ వాతావారణం సృష్టించి లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోంది’ అని మమత మండిపడ్డారు. ‘కేంద్రం ఒక ప్రత్యేక విధానంలో నడుస్తోంది. ప్రభుత్వ కీలక విధానాల గురించి కేంద్ర మంత్రులకే తెలియదు. ఈ ప్రభుత్వాన్ని ఇద్దరు సోదరులు (మోడీ, అమిత్షా) నడుపుతున్నారు. వారి చేతుల్లో అమాయకులైన ఎంతోమంది బలవుతున్నారు’ అని మమత విమర్శించారు.