ఆస్పత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్

కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ (శుక్రవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 48 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సినప్పటికీ.. ఆమె కోరిక ప్రకారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్న మమత ఆస్పత్రి నుంచి వీల్‌ చైర్‌లో బయటకొచ్చారు. అక్కడున్న వారి సాయంతో కారెక్కి తన ఇంటికి వెళ్లారు.

మమతా బెనర్జీపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని ఆరోపిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల అధికారి సునీల్‌ అరోడాను కలిసిన పార్టీ బృందం.. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని మెమోలు కూడా సమర్పించింది.

మమతా బెనర్జీ ఆస్పత్రిలో చేరడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. మార్చి 14 ఆదివారం రోజున మేనిఫెస్టోను ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.