అమిత్‌ షాకు ఫోన్‌ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మమతా బెనర్జీ

అమిత్‌ షాకు ఫోన్‌ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మమతా బెనర్జీ

కోల్‌కతా : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) జాతీయ పార్టీ హోదా కోల్పోవడంతో దానిని పునరుద్ధరించాలంటూ అమిత్‌ షాకు మమతా బెనర్జీ ఫోన్‌ చేశారంటూ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం (ఏప్రిల్ 18వ తేదీన) ఆరోపించారు. సువేందు వ్యాఖ్యలపై మమత స్పందించారు. ‘ సువేందుకు మాటలకు నేను ఆశ్చర్యపోయాను..షాక్‌ అయ్యాను. తృణమూల్ జాతీయ పార్టీ హోదా గురించి అమిత్ షాకు ఫోన్‌ చేసినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా’ అని అన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి ఫిరాయించిన సువేందు అధికారి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపైనా మమతా బెనర్జీ మాట్లాడారు. ‘కొన్నిసార్లు మౌనం బంగారం. ప్రతిపక్షం కలిసి కూర్చోని మాట్లాడుకోదని అనుకోవద్దు. మేమంతా కలిసే ఉన్నాం. అందరూ ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు గాలివానలా జరుగుతుంది’ అని అన్నారు.