
- అసోం ఎన్‌ఆర్సీపై మమత
- షాతో చర్చించిన బెంగాల్ సీఎం
న్యూఢిల్లీ: అసోం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్సీ) నుంచి బెంగాల్, బీహార్, గోర్ఖా, అసోంకు చెందిన నిజమైన ఇండియన్ల పేర్లు తొలగించారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా దృష్టికి ఆమె తీసుకెళ్లారు. పేర్లు తొలగించిన వాళ్లకు న్యాయం చేయాలని ఆమె కేంద్రమంత్రిని కోరారు. కేంద్ర హోంమంత్రిగా మూడునెలల క్రితం బాధ్యతలు చేపట్టిన అమిత్ షాను బెంగాల్ సీఎం గురువారం కలిశారు.
‘‘అసోం ఎన్ఆర్సీ అంశాన్ని హోంమంత్రితో చర్చించడానికి నేను ఇక్కడకు వచ్చాను. అసలైన ఇండియన్లు చాలా మంది పేర్లను లిస్ట్ నుంచి తొలగించారు. అలాంటి వాళ్లకు న్యాయం చేయాలని షాను కోరాను’’ అని మమతా … కేంద్రమంత్రిని కలిసిన తర్వాత మీడియాకు చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని షా తనకు హామీ ఇచ్చారని ఆమె అన్నారు. వెస్ట్‌బెంగాల్‌లో ఎన్‌ఆర్సీ అమలుపై చర్చలు జరిపారా అన్న ప్రశ్నకు ‘ ఆ అంశం’ చర్చకు రాలేదని చెప్పారు. బీహార్‌లో కూడా ఎన్‌ఆర్సీ అవసరంలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చెప్పడాన్ని ఆమె ఈసందర్భంగా మీడియాకు గుర్తుచేశారు.
‘‘ప్రధాని, హోంమంత్రిని కలవడం రాజ్యాంగపరమైన ఆబ్లిగేషన్ . దీంతోపాటు బంగ్లాదేశ్, భూటాన్ దేశాలకు బెంగాల్ సరిహద్దులో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్ని దేశంలోని ఇతరప్రాంతాలతో కలిపే సమస్యాత్మకమైన ‘ చికెన్స్ నెక్’ కూడా బెంగాల్‌తో ముడిపడి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హోం మంత్రిని కలవాల్సిన అవసరం ఉంది’’ అని మమత చెప్పారు. బుధవారం ఆమె ప్రధాని నరేంద్రమోడీని కలుసుకుని రాష్ట్రం పేరు మార్పు అంశాన్ని చర్చించారు.