
రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం ఇది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ .. ఇవాళ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్ కతా నగరంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమె మేనల్లుడు అభిషేక్ ముఖర్జీ కూడా పాల్గొన్నట్టు సమాచారం. రెండు గంటల పాటు ఈ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. 2021లో వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాలు రచించేలా… టీఎంసీ- ప్రశాంత్ కిశోర్ మధ్య అగ్రిమెంట్ కుదిరినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ లో బీజేపీ సంచలన ఫలితాలు సాధించింది. 2014 లో పశ్చిమబెంగాల్ లో ఒక ఎంపీ సీటు గెల్చుకున్న బీజేపీ… 2019లో 18 ఎంపీ సీట్లు దక్కించుకుంది. బలమైన రాజకీయ ప్రత్యర్థిగా మారిన బీజేపీని ఎదుర్కొని.. 2021లో గెలవాలంటే.. పక్కా రాజకీయ వ్యూహాలను అమలుచేయాలని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భావిస్తోంది. అందుకే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో చేతులు కలిపినట్టు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. వచ్చే నెల నుంచి ప్రశాంత్ కిశోర్.. వెస్ట్ బెంగాల్ లో తన స్ట్రాటజీని మొదలుపెట్టబోతున్నట్టు చెబుతున్నారు.
2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్, ప్రశాంత్ కిశోర్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ అఖండ విజయం సాధించారు.