బెంగాల్ లో మమత ‘తీన్‘ మార్

బెంగాల్ లో మమత ‘తీన్‘ మార్
  • రాష్ట్రాన్ని గెలుచుకుని..నందిగ్రామ్​లో ఓడిన మమత
  • తమిళనాడులో డీఎంకే గ్రాండ్ విక్టరీ.. సింగిల్​గానే మెజారిటీ!
  • కేరళలో పినరయి విజయం.. 40 ఏళ్ల రికార్డు బద్దలు
  • అస్సాంలో రెండో సారి బీజేపీ గెలుపు.. పుదుచ్చేరిలోనూ పాగా
  • దాదాపు అన్నిచోట్ల నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ మమతా బెనర్జీ భారీ విజయం సాధించారు. వరుసగా మూడోసారి టీఎంసీని అధికారంలోకి తెచ్చారు. అయితే రాష్ట్రాన్ని గెలిచినా.. తాను మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. కరుణానిధి, జయలలిత లేకుండా తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది. కేరళలో 40 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ.. ఎల్​డీఎఫ్ కూటమి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అస్సాంలో రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్​తో కలిసి బీజేపీ మెజారిటీ సాధించింది. 

మమత పార్టీ మూడోసారి..

పశ్చిమ బెంగాల్​ లో మమతా బెనర్జీ ప్రతి ఎన్నికలోనూ ఓట్లు, సీట్లు పెంచుకుంటూనే ఉన్నారు. 2011లో 184 సీట్లు గెలిచిన టీఎంసీ.. 2016లో 211కు పెంచుకుంది. ఇక తాజా ఎన్నికల్లో 215 సీట్లలో గెలిచింది. గత ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఈ సారి భారీగా బలాన్ని పెంచుకుంది. 75 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో 44 సీట్లలో గెలిచిన కాంగ్రెస్, 26  సీట్లలో గెలిచిన సీపీఎం పత్తాలేకుండా పోయాయి.

కోల్​కతా:పశ్చిమ బెంగాల్​లో అధికార తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ మమతా బెనర్జీ మరోసారి అధికారం దక్కించుకున్నారు. 215 సీట్లను గెలుచుకున్నారు. బీజేపీ 75 సీట్లలో ముందంజలో ఉంది. నందిగ్రామ్​లో జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతాబెనర్జీ ఓడిపోయారు. మరోవైపు మూడో సారి టీఎంసీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. మొత్తం ఓట్లలో టీఎంసీకి 48.51, బీజేపీకి 37.49 శాతం ఓట్లు దక్కాయి. ఇక లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమి కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. టాలీగంజ్​లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, చుంచురా సెగ్మెంట్​లో బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ ఓడిపోయారు. దిన్హతాలో పోటీ చేసిన మరో ఎంపీ నిషిత్ ప్రమాణిక్ ఓటమిపాలయ్యారు. గతంలో మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్ లో పోటీ చేసిన టీఎంసీ క్యాండిడేట్ శోభాందేబ్ ఛటోపాధ్యాయ్ గెలుపొందారు. కాంగ్రెస్ కు పట్టు ఉన్న ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో చాలా వరకు సీట్లను టీఎంసీ కొల్లగొట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ 8 దశల్లో ఎన్నికలు నిర్వహించారు.

గత ఎన్నికల్లో ఇలా..

2011లో కాంగ్రెస్, ఎస్​యూసీఐతో కలిసి మమత పోటీ చేశారు. దశాబ్దాలపాటు పాలించిన లెఫ్ట్ అలయన్స్ ను చిత్తుగా ఓడించారు. మమత కూటమి 227 సీట్లు గెలుచుకుంది. ఇందులో టీఎంసీకి 184 సీట్లు, కాంగ్రెస్​కు 42 సీట్లు, ఎస్​యూసీఐకి ఒక సీటు వచ్చింది. ఇక 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్​గా పోటీ చేసిన టీఎంసీ.. 211 సీట్లతో భారీ విక్టరీ సాధించింది. వెస్ట్ బెంగాల్​లో 1962 నుంచి 2016 వరకు.. కూటమి కాకుండా, సింగిల్ పార్టీ అధికారం దక్కించుకోవడం అదే తొలిసారి.

ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటం: బీజేపీ

తృణముల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన లీడర్లు ఎన్నికల్లో సరిగా పర్ఫామ్ చేయలేదని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. మమత వల్లే టీఎంసీ గెలిచిందని మరో నేత కైలాష్ విజయ్ వర్గీయ చెప్పారు. ‘‘ప్రజలు దీదీని ఎంచుకున్నరు. అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునేందుకు ఆత్మపరిశీలన చేసుకుంటాం. సంస్థాగత సమస్యలు, బయటి వ్యక్తులు–లోకల్స్ చర్చ తదితర అంశాలపై చర్చిస్తాం” అని కైలాష్ చెప్పారు. 

ఇది బెంగాల్ విక్టరీ

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బెంగాల్ విక్టరీ అని టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ అన్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని, కరోనాపై గెలిచాక సంబురాలు చేసుకుందామని కార్యకర్తలకు సూచించారు. ‘‘కరోనా సమస్య పరిష్కారానికే  నా తొలి ప్రాధాన్యం. దీనిపై వెంటనే చర్యలు చేపడుతాం. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పెద్దగా నిర్వహించం. ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం. ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఇది జరగకపోతే.. కోల్​కతాలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తా’’ అని హెచ్చరించారు.

టీఎంసీ ‘తీన్’​మార్​కు కారణాలివే

  • ‘లోకల్’ అంశాన్ని దీదీ జనాల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు. బయటి వాళ్ల మాటలు నమ్మొద్దంటూ ప్రధాని మోడీ, అమిత్ షా తదితరులను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. ఈ ప్రచారం మమతకు కలిసి వచ్చింది.
  • కాలికి కట్టుకట్టుకుని వీల్​ చైర్​లో ప్రచారం చేశారు. సానుభూతి ఓట్లు బాగానే  పడ్డాయి. 
  • కరోనా నేపథ్యంలో బెంగాల్​లో తక్కువ ఓటింగ్ నమోదైంది. తద్వారా వ్యతిరేక ఓట్లు తగ్గడం అధికార పార్టీకి కలిసొచ్చింది.
  • సువేందు అధికారి, దిలీప్ ఘోష్ లాంటి నేతలు ఉన్నా.. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించలేదు. గత లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టిన ఓటర్లు.. ప్రధాని మోడీ నాయకత్వానికి మద్దతు పలికారు. కానీ రాష్ట్రంలో బీజేపీకి ఫేస్ లేకపోవడం మైనస్​గా మారింది.
  • మహిళల కోసం ప్రకటించిన- కన్యాశ్రీ, రూపశ్రీ పథకాలు, ఉచిత రేషన్ వంటి పథకాలు ఉపయోగపడ్డాయి. 
  • బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ నేపథ్యంలో ముస్లింలు గంపగుత్తగా టీఎంసీకి ఓట్లు వేశారు.