పెట్రో రేట్ల పెరుగుదలపై ఎలక్ట్రిక్ స్కూటర్‌ పై దీదీ నిరసన

పెట్రో రేట్ల పెరుగుదలపై ఎలక్ట్రిక్ స్కూటర్‌ పై దీదీ నిరసన

కోల్ కతా: పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలను వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రయాణించి నిరసన తెలిపారు. గురువారం కోల్ కతాలోని హజ్రా మోర్ నుంచి సెక్రటేరియట్ వరకు 7 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆమె ప్రయాణించారు. బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీం ఎలక్ట్రిక్ స్కూటర్ ను నడుపుతుంటే మమతా వెనుక సీట్ లో కూర్చున్నారు. పెట్రో రేట్ల పెరుగుదలకు వ్యతిరేకంగా ఓ ఫ్లెక్సీని తన మెడకు తగిలించుకుని ప్రదర్శించారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న జనాలకు ఆమె అభివాదం చేస్తూ సెక్రటేరియట్ కు చేరుకున్నారు. తర్వాత ఆమె మాట్లాడుతూ… ‘పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాం. మోడీ సర్కారు తప్పుడు హామీలు ఇస్తోంది. పెట్రో ధరలు తగ్గించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు’అని విమర్శించారు. అధికారంలోకి రాక ముందు ఫ్రీగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్న మోడీ.. ఇప్పుడు వాటి రేట్లు పెంచుతున్నారని అన్నారు. మోడీ, అమిత్ షా ఇద్దరూ కలిసి దేశాన్ని అమ్మేస్తున్నారని మండిపడ్డారు.