బెంగాల్​లో వద్దు CAAను వెనక్కి తీసుకోండి: ప్రధానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి 

బెంగాల్​లో వద్దు CAAను వెనక్కి తీసుకోండి: ప్రధానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి 

    ఢిల్లీలో మాట్లాడదామన్న మోడీ

‘సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ)ను పశ్చిమ బెంగాల్​ప్రజలు వ్యతిరేకిస్తున్నరు. ఈ చట్టంతో పాటు నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్(ఎన్నార్సీ), నేషనల్​ పాపులేషన్​ రిజిస్టర్(ఎన్పీఆర్)లను కూడా వద్దంటున్నరు. సీఏఏ అమలును ఆపి, చట్టాన్ని నెమ్మదిగా వెనక్కి తీసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. కోల్​కతా పోర్ట్​ ట్రస్ట్​ 150 వ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల టూర్​లో భాగంగా ప్రధాని మోడీ శనివారం కోల్​కతా చేరుకున్నారు. రాజ్​భవన్​లో విడిది చేసిన ప్రధానిని మమతా బెనర్జీ కలిశారు.  తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ ఇప్పుడు మా అతిథి. ఇప్పుడిలా అడగడం కరెక్టో కాదో తెలియదు కానీ సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్​లను వెనక్కి తీసుకోవాలని ఆయనను కోరాం. ఇక్కడికి తాను వేరే పనులపై వచ్చానని, సీఏఏపై మాట్లాడేందుకు ఢిల్లీకి రమ్మని ప్రధాని కోరారు’ అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయాన్ని ప్రధాని దగ్గర ప్రస్తావించినట్లు మమత పేర్కొన్నారు.

మీటింగ్​ నుంచి నేరుగా ధర్నా వేదికకు..

ప్రధాని మోడీతో మీటింగ్​ ముగిసిన తర్వాత మమతా బెనర్జీ నేరుగా సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. రాజ్​భవన్​కు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్న రాణి రాష్మోణి రోడ్​లో టీఎంసీ స్టూడెంట్స్​ వింగ్​నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్​లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో సీఏఏ నోటిఫికేషన్​ కేవలం కాగితాలకే పరిమితమని, అమలు చేయబోమని మమత స్పష్టంచేశారు.