
- శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలకు మమత విజ్ఞప్తి
- ఆస్పత్రి నుంచి వీడియో మెసేజ్
కోల్ కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై జరిగిన దాడికి నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు, సపోర్టర్లు గురువారం ఆందోళనలు చేపట్టారు. రోడ్లను బ్లాక్ చేసి, టైర్లను కాలబెట్టారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలందరూ శాంతియుతంగా ఉండాలని, గొడవలు చేయొద్దని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే పనులు చేయొద్దని సూచించారు. ఈ మేరకు దీదీ ఆస్పత్రి నుంచే వీడియో మెసేజ్ ఇవ్వగా, దాన్ని టీఎంసీ రిలీజ్ చేసింది. ‘‘పార్టీ కార్యకర్తలు, సపోర్టర్లు, యాక్టివిస్టులు, ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.. నిన్న జరిగిన ఘటనలో నా కాలుకు బలమైన గాయమైంది. ఛాతిలో నొప్పి, తల నొప్పి ఉంది. ప్రస్తుతం డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. రెండు, మూడ్రోజుల్లోనే తిరిగి వస్తా. కారు బానెట్ పై నిల్చొని ప్రజలకు నమస్కారం చేస్తుండగా, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారు. ఆ టైమ్ లో కారు డోర్ నా కాలుకి తగిలింది” అని మమత వీడియోలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తాను ఒక్క రోజు కూడా వృథా చేయబోనని, అవసరమైతే వీల్ చైర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.
దీదీ హెల్త్ కండిషన్ స్టేబుల్..
మమత హెల్త్ కండిషన్ స్టేబుల్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. ‘‘మమతా బెనర్జీ ఎడమకాలు మడమ, పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. కుడి భుజం, మోచేయి, మెడకు కూడా దెబ్బలు తగిలాయి. ఆమెకు కాలు నొప్పి ఎక్కువగా ఉంది. రక్తంలో సోడియం స్థాయి తక్కువగా ఉంది” అని డాక్టర్లు చెప్పారు. మమత కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎం గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
సీఎంను చంపేందుకు కుట్ర: టీఎంసీ
సీఎంను చంపేందుకు కుట్ర జరిగిందని టీఎంసీ ఆరోపించింది. దాడి ఘటనపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదు చేసింది. మమతా బెనర్జీకి సెక్యూరిటీ కల్పించడంలో ఈసీ విఫలమైందని టీఎంసీ మండిపడింది. దాడి ఘటనకు ఈసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. నందిగ్రామ్ లో హింసకు పాల్పడేందుకు బీజేపీ కొంతమందిని తీసుకొచ్చిందని ఆరోపించింది. బీజేపీ చెప్పినట్లు ఈసీ నడుచుకుంటోందని.. సీఎంపై దాడి జరిగే అవకాశం ఉందని రిపోర్టులు వచ్చినప్పటికీ, ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ చెబితేనే ఈసీ డీజీపీని తొలగించిందని.. ఆ తర్వాత రోజే దాడి జరిగిందని చెప్పింది.
సానుభూతి కోసమే డ్రామా: బీజేపీ
టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. మమతపై దాడి జరగలేదని, అది కేవలం ప్రమాదం మాత్రమేనని చెప్పింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకే ఆమె దాడి డ్రామా ఆడుతున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ‘‘ఈ ఘటనను మేం రాజకీయం చేయాలనుకోవడం లేదు. సీఎం తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అది ప్రమాదమేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కానీ సీఎం తనపై దాడి జరిగిందని అంటున్నారు. దీనిపై అత్యున్నత విచారణ చేయించాల్సిన అవసరం ఉంది” అని బీజేపీ అధికార ప్రతినిధి సామిక్ భట్టాచార్య అన్నారు.