ఓట్లు పోతాయనే దీదీకి దిగులు..!

ఓట్లు పోతాయనే దీదీకి దిగులు..!

సెంటర్​తో తగాదాకి ఎప్పుడూ రెడీగా ఉండే ముఖ్యమంత్రిగా ఫైర్​బ్రాండ్​ మమతా బెనర్జీ పేరుబడ్డారు. బెంగాల్​లో ఎన్నార్సీ అమలు చేస్తామనగానే పట్టుదలకు పోయారు. సీఏఏ పేరు చెబితే భగ్గున మండిపడుతున్నారు. లెఫ్ట్​ ఫ్రంట్​ని ఓడగొట్టి తృణమూల్​ రెండుసార్లు పవర్​లోకి రావడానికి ముస్లిం ఓట్లే కీలకం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైమ్​ ఉన్నందువల్ల… హిందూ ఓట్ల శాతాన్ని పెంచుకోవటంపై దృష్టి పెట్టాలని​ తృణమూల్​ సీనియర్లు సూచిస్తున్నారు.

సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​పై ఏ ముఖ్యమంత్రీ లేనంత కసితో ఉన్నారు మమతా బెనర్జీ. ‘ఈ యాక్ట్​ని పశ్చిమ బెంగాల్​లోకి రానివ్వను. కాదు కూడదంటే, నా డెడ్​బాడీ మీదనే అమలు చేయాలి’ అంటున్నారు. ఎందుకంత పట్టుదలగా ఉన్నారో ఒక పరిశీలించాలి. వెస్ట్​ బెంగాల్​ సీఎం, తృణమూల్​ చైర్​పర్సన్​ అయిన మమతను  రెండు భయాలు పీడిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ముస్లిం డామినేటెడ్​ నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటికే పుంజుకుంది. తాను గెలుచుకున్న 18 ఎంపీ సీట్లలో ఎనిమిది బంగ్లాదేశ్​ సరిహద్దుల్లోని లోక్​సభ సెగ్మెంట్లు. మరోవైపున 2014లో 34 సీట్లు సాధించిన తృణమూల్​ ఈసారి 22 సీట్లకు పడిపోయింది. ఇది మమతకుగల మొదటి భయం.

రెండోది నేషనల్​ సిటిజన్​షిప్​ రిజిస్ట్రీ (ఎన్నార్సీ)తోపాటు కొత్తగా సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ)కూడా వచ్చేసింది. ఎన్నార్సీని దేశమంతా తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించడం, సీఏఏ ద్వారా పశ్చిమ బెంగాల్​లో పెద్ద సంఖ్యలో ఇల్లీగల్​గా ఉంటున్న మైనారిటీలను ఏరివేసే అవకాశం ఉండడం. ఈ రెండు భయాలతోనే వెస్ట్​ బెంగాల్​ ఫైర్​ బ్రాండ్​ మమత కేంద్రంతో అమీతుమీకి రెడీ అవుతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. దీనికి గ్రాస్​ రూట్స్​ దేశ విభజనలో ఉన్నాయి. ఈస్ట్​ పాకిస్థాన్​ వైపు వెళ్లిపోయిన బెంగాలీ ముస్లింలకు బెంగాల్​లో చాలా భూములుండేవి. ఆ భూములన్నీ వెస్ట్​ బెంగాల్​ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీళ్లు బంగ్లాదేశ్​ యుద్ధ సమయంలో వెనక్కి వచ్చినా శరణార్థులుగా ఉన్నారు తప్ప, ఇండియన్​ సిటిజెన్స్​ కాలేకపోయారు. పశ్చిమ బెంగాల్​లో లెఫ్ట్​ ఫ్రంట్​ జరిపిన భూపోరాటాల ఫలితంగా ముస్లింల భూములు నిరుపేద రైతులకు, దళితులకు పంపకమైపోయాయి. లెఫ్ట్​ ఫ్రంట్ ​తన 34 ఏళ్ల పాలనలో జరిపిన భూ పంపిణీలతో ముస్లిం ఓటర్లు ఆల్టర్నేటివ్​ కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో తృణమూల్​ కాంగ్రెస్​ తరఫున గట్టిగా వాయిస్​ వినిపిస్తున్న మమతను ‘దీదీ (అక్కయ్య)’గా ఆదరించారు. వీళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా పడడంతో 2011, 2016ల్లో వరుసగా రెండుసార్లు తృణమూల్​ ప్రభుత్వం ఏర్పడింది.

ఇప్పుడు గనుక సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ని, ఎన్నార్సీని పశ్చిమ బెంగాల్​లో అమలు చేస్తే… ఈ ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని మమత భయపడుతున్నారు. బంగ్లా స్వతంత్ర పోరాట సమయంలో అక్కడి నుంచి పొరుగున ఉన్న ఇండియాకి పెద్ద సంఖ్యలో హిందువులు సహా ముస్లిం తదితర మైనారిటీలు వచ్చేసి, వెనక్కి వెళ్లకుండా సెటిలైపోయారని చెబుతున్నారు. ఉత్తర వెస్ట్​ బెంగాల్​లోని జల్పాయ్​గురి, అలీపూర్​దౌర్​, మాల్డా, ఉత్తర దినాజ్​పూర్​, దక్షిణ దినాజ్​పూర్​ జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. అలాగే, దక్షిణ వెస్ట్​ బెంగాల్​లోని నార్త్​ 24 పరగణాలు, సౌత్​ 24 పరగణాలు జిల్లాలుకూడా బెంగాలీ ముస్లింల ప్రాబల్యంతో ఉంటాయి.  మొత్తంగా బంగ్లాదేశ్​ని ఆనుకుని ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో 70 చోట్ల ఇప్పటి వరకు ముస్లిం మైనారిటీలకు చెందినవాళ్లే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నట్లు డేటా చెబుతోంది. అస్సాంలో మాదిరిగా పక్కాగా ఎన్నార్సీని చేపడితే వెస్ట్​ బెంగాల్​లో చాలామందికి సిటిజన్​షిప్​ గల్లంతవుతుంది. జల్పాయ్​గురి, మాల్డా, రాయ్​గంజ్​, డార్జిలింగ్, 24 పరగణాలు​ వంటి జిల్లాల్లో సెటిలైన బంగ్లా వలసదారుల్ని పంపేయాల్సి వస్తుంది. బెంగాల్​ ఓటర్లలో వీళ్లు చాలా కీలకమని, అందుకే ఎన్నార్సీ–సీఏఏలను తృణమూల్​ అడ్డుకోవాలని చూస్తోందని బీజేపీ బాగా ప్రచారంలో పెట్టింది. బంగ్లా నుంచి వలస వచ్చినవాళ్లలో 20 శాతం మంది హిందువులు, 30% ముస్లింలు పశ్చిమ బెంగాల్​లో ఉన్నట్లు అంచనా. ముస్లిం జనాభా ఈ యాభై ఏళ్లలోనూ బాగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.

బీజేపీ ఒక క్రమపద్ధతిలో తన స్ట్రేటజీని వెస్ట్​ బెంగాల్​లో అమలు చేస్తూ వస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిచిన బీజేపీ… ప్రస్తుతం 126 సెగ్మెంట్లలో బలంగా కనిపిస్తోంది. వీటిలో 56 సీట్లు బంగ్లా సరిహద్దుల్లో ఉన్నాయని గమనించాలి.  బంగ్లా బోర్డర్​ సీట్లలో సగానికి పైగా ముస్లిం ఓటర్లున్న రాయ్​గంజ్​ లోక్​సభా సెగ్మెంట్​కూడా ఇప్పుడు బీజేపీ చేతిలోనే ఉంది. గతంలో తృణమూల్​కి గట్టి మద్దతుదార్లుగా ఉన్న మతువా కమ్యూనిటీ ఓట్లను బీజేపీ చీల్చుకోగలిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు గనుక చీలిపోతే…. దీదీ పరిస్థితి తారుమారవుతుంది. తృణమూల్​ పుట్టినప్పటినుంచీ లెఫ్ట్​ ఫ్రంట్​తో పోరాటానికే అన్ని శక్తులూ ధారపోసిందని, ఇప్పుడు కొత్తగా బీజేపీని డీకొట్టాల్సి వస్తోందని ఎనలిస్టులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైమ్​ ఉన్నందువల్ల… తృణమూల్​ కేవలం ముస్లింల ఓట్లపైనే ఆశలు పెట్టుకోవద్దని, హిందూ ఓట్ల శాతాన్ని పెంచుకోవటంపై కూడా దృష్టి పెట్టాలని​ ఆ పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. లేనట్లయితే, తృణమూల్​ పరిస్థితి రివర్స్​ అవుతుందని హెచ్చరిస్తున్నారు.

రెండు పనుల్లో సక్సెసయితేనే…

మొత్తం ఇండియాలో ముస్లిం ఓటర్ల సగటు​ 14 శాతం. రాష్ట్రాలవారీగా చూసినప్పుడు పశ్చిమ బెంగాల్​లో 31 శాతానికి పైగా ముస్లిం ఓటర్లుంటారు. అసెంబ్లీలోని 294 సీట్లలో దాదాపు 125 సీట్లలో ముస్లిం ఓట్లే డిసైడింగ్​ ఫ్యాక్టర్​గా ఉన్నాయి. వీళ్ల ఓట్లతోనే 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారం దక్కించుకుంది. 2019 లోక్​సభ ఎన్నికలనాటికి పరిస్థితి తారుమారైంది. బంగ్లాదేశ్​ బోర్డర్​లోని 8 సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఈ సీట్లు మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉన్నవి. బీజేపీని అడ్డుకోవడం, ముస్లిం మైనారిటీలకు తానే పెద్ద దిక్కని చాటుకోవడం మమత ముందున్న తక్షణ లక్ష్యాలు. ఈ రెండు పనుల్లోనూ సక్సెస్​ అయితేనే 2021 శాసన సభ ఎన్నికల్లో మమతకు మళ్లీ గెలిచే ఛాన్స్​ ఉంటుందని చెప్తున్నారు ఎనలిస్టులు.