
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ కవిత రాశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేస్తూ రాసిన ఈ కవితను ఆమే తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ కవితలో ఆమె.. మా హక్కులను తొక్కడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ఆమె అవిశ్వాసం వ్యక్తం చేస్తూ.. ‘దేశం వింతగా మారింది.. ఇది నా జన్మ భూమి కాదు! భారతదేశం మాకు ఎప్పుడూ వివక్షను నేర్పించలేదు. మా హక్కులను కాలరాయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? మీ ఈ పనికి సిగ్గుపడండి’ అని కవితలో ప్రశ్నించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన ఈ కవితలో.. హక్కులను హరించడం గురించి ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత.. ఎన్‌ఆర్‌సిని, కొత్త పౌరసత్వ చట్టాన్ని ‘ద్వేషపూరిత సాధనాలు’గా వ్యాఖ్యానించారు. పాత కరెన్సీని మార్పిడి చేయడానికి పేద ప్రజలు చాలా రోజులు గంటల కొద్దీ క్యూలలో నిలబడ్డారు.. మళ్లీ ఇప్పుడు క్యూలలో ఎందుకు నిలబడాలి అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. NRC, CAA పేరుతో ప్రజలను విభజించడాన్ని ఆమె ఖండించారు. మానవ హక్కులు అందరికీ ఉన్నాయని, వాటిని హరించవద్దని, హక్కుల కోసం పోరాడలని ఆమె పిలుపునిచ్చారు.
CAAకి వ్యతిరేకంగా రాసిన తన కవితను బెంగాలీ భాషలో ‘అధికార్’ పేరుతో మమత తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. అలాగే ఇంగ్లీష్‌లో ‘అవర్ రైట్స్’ పేరుతో పోస్టు చేశారు.
For More News..