
- వర్చువల్ ర్యాలీలో అమిత్ షా
- బెంగాల్‌లో 18 సీట్లు గెలవడం..
- 303 సీట్లు గెలవడం కంటే ఎక్కువ
న్యూఢిల్లీ: మన దేశంలో రాజకీయ హింసను ప్రమోట్ చేసే ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మంగళవారం పశ్చిమబెంగాల్‌లో వర్చువల్‌గా నిర్వహించిన బంగ్లార్ జనసంబేశ్ ర్యాలీలో పాల్గొన్న ఆయన దీదీపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎలక్షన్స్‌లో 303 స్థానాలు గెలిచిన దానికంటే.. బెంగాల్‌లో 18 సీట్లు గెలవడం చాలా గొప్ప అని అమిత్ షా అన్నారు. పొలిటికల్ గొడవల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 100 మంది బీజేపీ వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని షా చెప్పారు. సోనార్ బంగ్లా అభివృద్ధికి సహకరిచిన వారి కుటుంబాలను గౌరవిస్తున్నాను అని అన్నారు.“ మోడీజీ కోసం మీ మద్దతు అడుగుతున్నాం. లోక్‌సభ ఎలక్షన్స్‌లో మీరు ఇచ్చిన మద్దతు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చింది రాజకీయం కోసం కాదు. బెంగాల్ సంస్కృతిని బలోపేతం చేసేందుకు. మేం బెంగాల్ సంస్కృతిని మెరుగుపరచాలని, పునరుద్ధరించాలని అనుకుంటున్నాం” అని అమిత్‌షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్‌ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రానివ్వడం లేదని ఆమెపై ధ్వజమెత్తారు. ఆయుష్మాన్ భారత్ పేదల కోసం ప్రవేశపెట్టిందని, వాళ్ల హక్కులను మీరు లాక్కునేందుకు వీలు లేదని దీదీపై ఫైర్ అయ్యారు. వలస కార్మికులకు ‘కరోనా ఎక్స్‌ప్రెస్’ అని పేరు ఇచ్చిన మమతకు అదే ‘ఎగ్జిట్ రూట్’ అని అన్నారు. వలస కార్మికులు నిన్ను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని, వాళ్లు నిన్ను వదలరని అన్నారు.