జాతీయ రాజకీయాలపై మమత ఫోకస్

జాతీయ రాజకీయాలపై మమత ఫోకస్

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న మమత... అంతకుముందే తన జాతీయ రాజకీయ ప్రవేశానికి గ్రౌండ్ సెట్ చేసుకున్నారు. 7 సార్లు పార్లమెంట్ కు ఎన్నికై, కేంద్రమంత్రిగానూ పనిచేసినప్పటికీ... ఆమె లక్ష్యం ఎల్లప్పుడూ బెంగాలే. దాంతో ఆమె జాతీయ రాజకీయాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. బెంగాల్ లో ఆమె అనుకున్న లక్ష్యం సాధించారు. వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. దీంతో ఇప్పుడు ఆమె జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. 

కోల్ కతాలో నిన్న(శుక్రావారం) తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. కొందరు ఎంపీలు ప్రత్యక్షంగా, మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. TMC పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా మమతా బెనర్జీని ఎన్నుకున్నారు. ఇదే జాతీయ రాజకీయాల్లో మమత వేసిన మొదటి అడుగుగా చెబుతున్నారు. పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా ఆమె ఎన్నిక కావడంతోనే... తన ఫోకస్ ఇక జాతీయ రాజకీయాలేనని  ఆమె విస్పష్టంగా ప్రకటించినట్టు స్పష్టమవుతోందని ఎక్స్ పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. 

ఇవాళ(శనివారం) ఢిల్లీ వెళ్తున్నారు మమత. ప్రధాని మోడీతో పాటు మరికొందరు నేతలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆమె కలిసే అవకాశముందని ఢిల్లీ వర్గాల సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ కు పార్లమెంట్ లో 33 మంది ఎంపీలున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు గెలవలేకపోయినా... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మమతా బెనర్జీ ప్రభంజనం సృష్టించారు. దానిని జాతీయ స్థాయికి విస్తరించే పనిలో ఉన్నారు మమత. జాతీయ స్థాయిలో బీజేపీకి ఎదురే లేకుండా పోవడంతో... ప్రతిపక్షాలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ఆలోచనలో మమత ఉన్నట్టు తెలుస్తోంది. పెగసస్  స్పైవేర్  రచ్చ, కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర విఫలమైందన్న వాదనలు, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెరుగుదల, వ్యవసాయ చట్టాలు ఇలా బర్నింగ్ ఇష్యూస్ అన్నింటిపై పోరాట కార్యాచరణ రెడీ చేస్తున్నట్టు సమమాచారం. మంచి పాలన అందించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ... ప్రణాళిక రూపొందించుకుని ఒక్కటిగా పనిచేయాలని ఈ మధ్యే మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఆ దిశగానే మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు.