ఢిల్లీపై దీదీ గురి!

ఢిల్లీపై దీదీ గురి!

మోడీ సర్కార్ పై దీదీ సర్కార్ సాగిస్తున్న యుద్ధం వెనుక మతలబు ఏంది? వామపక్షాల కంచుకోటను తన వశం చేసుకొని రెండోసారి సీఎంగా ముందుకుసాగుతున్న మమతా బెనర్జీ ధర్నాలో మర్మం ఏంది?! బెంగాల్ టైగర్ ఇంత స్థా యిలో గర్జించడం వెనుక ఆంతర్యం ఏంది? మరో రెండు మూడు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు బెంగాల్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. ఇన్నాళ్లూ మోడీ వర్సె స్ రాహుల్ గా నడుస్తున్నపోరు.. ఇప్పుడు మోడీ వర్సెస్ దీదీగా టర్న్​ తీసుకుంది.
ఇప్పుడే ఎందుకు?
మమతా బెనర్జీ ఆరోపిస్తున్నట్లు మోడీ సర్కార్ సీబీఐని తన చెప్పుచేతల్లో ఉంచుకుందా? అయితే.. ఇన్నాళ్లూ ఆ అంశాన్ని పెద్దగా ప్రస్తావించని దీదీ ఇప్పుడే ఎందుకు తెరమీదికి తెచ్చినట్లు ? యూపీఏ హయాంలో ఇలాంటి ఆరోపణలు లేవా?. పంజరంలో చిలుక సీబీఐ’ అని గతంలో సాక్షాత్తు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిందంటే కేంద్ర దర్యాప్తు సంస్థ పనితీరు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సీబీఐకి తాము వ్యతిరేకంకాదని, దాని వ్యవహార తీరుకే వ్యతిరేకమని ధర్నా వేదికగా మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాలపై ఉసిగొల్పుతున్నదని ఆమె ఆరోపించారు. అయితే, ధర్నా ద్వారా ఒక వైపు మోడీ సర్కార్ ను ఎండగడుతూనే మరోవైపు ప్రతిపక్షాలకు తానే పెద్దదిక్కన్న సంకేతాలను మమత పంపారు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ శ్రేణులు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెరమీదికి తెస్తున్నాయి. డీఎంకే బహిరంగంగానే ఆయన పేరును ప్రకటించేసింది. ఇది కొందరు సీనియర్లకు మింగుడుపడటం లేదు. అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి వస్తున్నప్పుడు.. కేంద్రంలో అధికారంలోకి రావడం అంత కష్టమేమి కాదని, అలాంటప్పుడు తామెందుకు ప్రధాని కావొద్దని పలువురు నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వారిలో మమత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె సీబీఐ అంశాన్ని తెరమీదికి తెచ్చారు . దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకున్నారు. దీదీ ధర్నాకు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలపక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇలా అందరి మద్దతును కూడగట్టిన మమత.. రేపు లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తెరమీదికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రమాణం వేళ మొదలైన ప్రతిపక్షాల ఐక్యత.. ఇటీవల కోల్ కతాలో మమత నిర్వహించిన ర్యాలీతో పటిష్టమైంది. కోల్ కతా ర్యాలీకి 24 పార్టీలు తరలివచ్చి.. నరేంద్రమోడీ సర్కార్ పై కాలుదువ్వాయి. ర్యాలీ ద్వారా తన బలం ఇది అని మమత నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ధర్నా ద్వారా మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు.