వలస కూలీల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయండి

వలస కూలీల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయండి
  • కేంద్రానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి

కోల్​కత: కరోనా ఎఫెక్టు నేపథ్యంలో వలస కార్మికులకు ఒక్కొక్కరికి రూ .10 వేల చొప్పున సహాయం అందించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లాక్​డౌన్ కారణంగా కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సాయం అందించాలని ఆమె ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్స్ ఫండ్ (పిఎం-కేర్స్) లో కొంత భాగాన్ని కూలీల కోసం ఉపయోగించాలని ఆమె ప్రధానికి సూచించారు. “కరోనా మహమ్మారి వల్ల ఊహించలేనంత మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులతో సహా వలస కూలీలకు ఒక్కొక్కరికి ఒకేసారి రూ. 10,000 చొప్పున వారివారి ఖాతాల్లో వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను”అని మమతా ట్వీట్ చేశారు.