లెఫ్ట్ ను పడగొట్టిన టీఎంసీ

లెఫ్ట్ ను పడగొట్టిన టీఎంసీ

పశ్చిమ బెంగాల్లో ఈసారి మూడు జాతీయ పార్టీలకు, ఒక ప్రాంతీయ పార్టీకి మధ్య పోరు జరిగింది. వీటిలో కాంగ్రెస్‌‌, లెఫ్ట్‌‌  ఆటలో అరటి పండ్లుగానే ఉన్నాయి. ప్రధాన పోటీ బీజేపీ–తృణమూల్‌‌ మధ్యే సాగింది. ఈసారి టికెట్ల కేటాయింపులో బెంగాల్‌‌ సీఎం మమత మహిళలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. చివరి రెండు విడతల పోలింగ్‌‌లోనూ ఈ రాష్ట్రంలో వయొలెన్స్‌‌ చోటుచేసుకోవడాన్నిబట్టి బీజేపీ, తృణమూల్‌‌ ఎంత ప్రెస్టీజియస్‌‌గా పనిచేశాయో అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్​లో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 1977 నుంచి 2011 వరకు అధికారంలో ఉంది.  ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ చేతిలో దెబ్బతిని మళ్లీ కోలుకోలేదు. 2014 లోక్‌‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 సెగ్మెంట్లలోనూ పోటీ చేసి కేవలం రెండు సెగ్మెంట్లలోనే సీపీఎం విజయం సాధించింది. ఇప్పుడా లోటుని పూరించడానికి బీజేపీ రంగంలోకి దిగింది. జాతీయ పార్టీ అయిన బీజేపీ, ప్రాంతీయ పార్టీ ‘తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)’తో ఎన్నికల యుద్ధం చేసింది. కాంగ్రెస్ ఇక్కడ నామమాత్రమే. ఈ నేపథ్యంలో తృణమూల్‌‌ని ఢీ కొట్టే సత్తా బీజేపీకే ఉందని సామాన్య ప్రజలు డిసైడ్ అయ్యారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించిన విధానాల పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజలు చాలామందికి బీజేపీయే ప్రత్యామ్నాయంగా కనిపించింది. బీజేపీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా పావులు కదిపింది. మిగతా పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది.

యాంటీ–ఇనకంబెన్సీపై బీజేపీ ఆశలు

2014 లోక్‌‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 34 సెగ్మెంట్లలో విజయం సాధించింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ కేవలం నాలుగు సీట్లతోనూ, లెఫ్ట్ ఫ్రంట్ రెండు సీట్లతో సరిపుచ్చుకోవలసి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి కూడా  కేవలం రెండు సీట్లే వచ్చినా, బెంగాల్‌‌లో ఎంట్రీ దొరికింది. ఈ ప్రమాదాన్ని మమత ముందుగానే ఊహించి, తన బాణాల్ని బీజేపీ వైపు ఎక్కుపెట్టారు. ఎన్డీయే సర్కార్‌‌పై తీవ్ర విమర్శలకు దిగారు. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా రాష్ట్రంలో కాలుపెట్టకుండా చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌‌ దిగడానికిసైతం ఒక దశలో పర్మిషన్ ఇవ్వలేదు. షా ప్రచారంలో హింస చెలరేగింది. దీంతో మమతపై బీజేపీ అగ్ర నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌‌లో ప్రజాస్వామ్యం కాపాడాలని పిలుపునిచ్చారు. అయితే, ఈసారి బెంగాల్‌‌ బరిలోకి ఎక్కువగా మహిళలను దింపారు మమత. క్యాడర్‌‌ని కూడా ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ సుడిగాలిలా ప్రచారం సాగించారు. దీంతో బీజెపీ వర్సెస్‌‌ తృణమూల్‌‌లో ఎవరిది పైచేయి కావచ్చన్న ఆసక్తి బాగా పెరిగింది.