ఎప్పటికైనా రైతుగానే సెటిలవుతా

ఎప్పటికైనా రైతుగానే సెటిలవుతా

ఏడోతరగతిలోనే పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. సాహిత్యం మీద ఇష్టం ఏర్పడింది. సమాజానికి మంచి చేసే విషయాలను సినిమా ద్వారా చెప్తేనే ప్రజలకి బాగా అర్థమవుతుంది అనుకున్నాడు. పెద్దపల్లి నుంచి హైదరాబాద్‌‌‌‌ వచ్చాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, అసోసియేట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా చేశాడు. ఇంకొన్ని సినిమాలకు డైలాగులు రాయడంలో సాయం చేశాడు.  ‘వకీల్‌‌‌‌సాబ్‌‌‌‌’ సినిమాకు డైలాగ్‌‌‌‌ రైటర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశాడు. పవన్‌‌‌‌కల్యాణ్‌‌‌‌తో తెలంగాణ యాసలో డైలాగులు చెప్పించి ‘వావ్‌‌‌‌’ అనిపించుకున్నాడు. ‘ఇండస్ట్రీకి రాకపోయుంటే వ్యవసాయం చేసేవాడిని. ఎప్పటికైనా రైతుగా సెటిలవుతా అంటున్న మామిడాల తిరుపతితో ఇంటర్వ్యూ.  

సాహిత్యంపై ఆసక్తి ఎలా వచ్చింది?

చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేవి. ఏడో తరగతిలోనే పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. మాండలికానికి సంబంధించిన పుస్తకాలు బాగా చదివేవాడ్ని. వాటిలో తెలంగాణ మాండలికానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ ఉండేవి. వట్టికోట ఆళ్వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వామి, దాశరథి రంగాచారి, అల్లం రాజయ్య లాంటి వాళ్ల పుస్తకాలు ఎక్కువగా చదివాను. ఇప్పుడు ఇంట్లో పెద్ద లైబ్రరీనే ఉంది. ఈ పుస్తకం, ఆ పుస్తకం అని లేదు అన్నీ చదువుతా. కాళోజి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి వాళ్ల రచనలంటే చాలా ఇష్టం. డైలాగులు, కొన్ని కథలు రాస్తున్నానంటే అది తెలుగు రచయితల భిక్షే. వాళ్ల పుస్తకాల నుంచి తీసుకున్న ఇన్‌‌‌‌‌‌‌‌పుట్సే అవి.  
   
డైలాగ్‌‌‌‌‌‌‌‌లు రాసేటప్పుడు హోం వర్క్‌‌‌‌‌‌‌‌ ఎలా చేస్తారు?

 హీరో దగ్గర నుంచి జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌ వరకు మాట్లాడే ప్రతి చిన్నమాట డైలాగ్‌‌‌‌‌‌‌‌ రైటరే రాస్తాడు. అందుకే, కథలో చెప్పాల్సిన కథాంశం ఏంటి? లీడ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏంటి? అని స్టడీ చేస్తాం. క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌ను బట్టి సంభాషణలు రాస్తాం. ఒక్కోసారి షూటింగ్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నప్పుడు స్పాట్‌‌‌‌‌‌‌‌లో అక్కడికక్కడే కొన్ని మార్పులు చేస్తారు. జనాలకు మంచి చేయాలనే దృక్ఫథంతో  ఉంటుంది ‘వకీల్‌‌‌‌‌‌‌‌సాబ్‌‌‌‌‌‌‌‌’ సినిమాలో ని పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అందుకని దానికి తగ్గట్లుగానే డైలాగులు ఉంటాయి. 
    
‘ పింక్‌‌‌‌‌‌‌‌’ రీమేక్‌‌‌‌‌‌‌‌ కదా ‘వకీల్‌‌‌‌‌‌‌‌సాబ్‌‌‌‌‌‌‌‌’ దానికి డైలాగులు రాయడంలో జాగ్రత్త పడ్డారా?

‘పింక్‌‌‌‌‌‌‌‌’ సినిమాలోని డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ను చాలా మార్పులు చేశాం. పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌ లాంటి హీరో సినిమా అంటే అన్ని వర్గాల వాళ్లు చూస్తారు. అందుకు తగ్గట్లుగానే డైలాగులు రాశాను. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేణు శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ సినిమాలో కొన్ని డైలాగులు రాశారు. ‘పింక్‌‌‌‌‌‌‌‌’ డైలాగ్‌‌‌‌‌‌‌‌ రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రితేశ్‌‌‌‌‌‌‌‌ షా మంచి ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. అందుకు ఆయనకు చాలాపెద్ద థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ చెప్పాలి. ఆయన అలా రాశారు కాబట్టే మనకు కూడా ఇంత మంచి  కంటెంట్‌‌‌‌‌‌‌‌ దొరికింది.  

తెలంగాణ యాసనే ఎందుకు వాడారు?

నాది, డైరెక్టర్‌‌‌‌ది తెలంగాణ. ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. అందుకే ఈ యాసలోనే రాయలనుకున్నాను.  పవన్‌‌కల్యాణ్‌‌కు కూడా తెలంగాణ అంటే ఇష్టం. అందుకే, తెలంగాణ యాస తీసుకున్నాం. కోర్టులో సహజంగా పుస్తక భాషే ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి ఆ  సీన్లలో కొద్దిగా యాస మారుతుంది.
 
ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు వర్క్‌‌‌‌‌‌‌‌ చేశారు?

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కి వచ్చిన ఏడాది పి.ఎన్‌‌‌‌‌‌‌‌ రామచంద్రం తీసిన ‘గోల్‌‌మాల్‌‌’ సినిమాకు అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత శివనాగేశ్వరరావు దగ్గర రెండు సినిమాలకు పనిచేశాను. దాసరి నారాయణ రావు ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ సినిమాకి చేశాను. అలా కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, అసోసియేట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్‌‌‌‌‌‌‌‌ చేశాను. 2008లో శ్రీవెంకటేశ్వర బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరయ్యా. అప్పటినుంచి ఇప్పటికీ దాంట్లోనే వర్క్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నా. ‘జోష్‌‌‌‌‌‌‌‌’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఓ మై ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌’ సినిమాలకు అసోసియేట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశాను. ‘స్పైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమాకు మాటల సహకారం అందించాను. ‘ఎంసీఏ’ సినిమాకు డైలాగ్‌‌‌‌‌‌‌‌ రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేశాను. ఇప్పుడు ‘వకీల్‌‌‌‌‌‌‌‌సాబ్‌‌‌‌‌‌‌‌’ సినిమాకు రాశాను. ఇంకొన్ని ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌ కూడా చేస్తున్నాను.

ఈ మొత్తం జర్నీలో ఏమైనా కష్టాలు పడ్డారా? 

ఈ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లోకి రావాలనుకునేవారికి పేరు అంత ఈజీగా రాదు. నేను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వచ్చినప్పుడు అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవుతోంది. అదీకాక తెలంగాణ నుంచి వచ్చినవారు చాలా తక్కువ. చాలా కష్టపడ్డాను. డైరక్షన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉన్న నేను రైటర్‌‌‌‌గా ఉన్నానంటే శ్రీరామ్‌‌ వేణునే కారణం. నన్ను సొంత తమ్ముడిలా చూసుకుంటారు. ఆయనతో పాటు ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిల్‌‌‌‌‌‌‌‌రాజు, శిరీష్‌‌‌‌‌‌‌‌కి కూడా థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ చెప్పుకోవాలి.  
  
డైరక్షన్‌‌‌‌‌‌‌‌ చేసే ఆలోచన ఉందా?

నా గోల్‌‌‌‌‌‌‌‌ అదే. ఎప్పటికైనా కచ్చితంగా ఒక సినిమా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తా. కొన్ని కథలు కూడా రాసుకున్నాను. ప్రస్తుతానికి రెండు మూడేళ్లు రైటింగ్‌‌‌‌‌‌‌‌ వైపే ఉండాలి అనుకుంటున్నా. హిస్టారికల్‌‌‌‌‌‌‌‌, పల్లెటూరు బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఉన్న సినిమాలు తియ్యాలనేది కోరిక. తెలంగాణకు చెందిన చాలామంది నిజజీవితంలో పోరాడి, గెలిచిన వాళ్లు ఉన్నారు. వాళ్ల జీవిత కథల బయోపిక్స్‌‌‌‌‌‌‌‌ తియ్యాలనే ఆలోచన ఉంది. 

ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌ ఎవరు?

మా నాన్నే నా ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌. తను ఆనందంగా ఉంటూ తన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకునే వ్యక్తిత్వం నాన్నది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. మాకు ఎప్పుడూ ‘అది చెయ్యి, ఇది చెయ్యి’ అని చెప్పడు. అందుకే, నేను సినిమా ఫీల్డ్‌‌‌‌‌‌‌‌కు వెళ్తాను అన్నప్పుడు కూడా ఏం అనలేదు.  

 
 ఇప్పటివరకు మీకొచ్చిన బెస్ట్‌‌‌‌‌‌‌‌ కాంప్లిమెంట్‌‌‌‌‌‌‌‌?
పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌కు నన్ను దిల్‌‌‌‌‌‌‌‌రాజు పరిచయం చేసినప్పుడు ‘క్యారెక్టర్‌‌‌‌ను భలే పట్టుకున్నావు డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ బాగున్నాయి’ అన్నారు. ఆ ఆనందంలో అలా ఉండిపోయాను. సెకండాఫ్‌‌‌‌‌‌‌‌ డైలాగులు రాయడం అయ్యాక వేణు అన్న వచ్చి ‘తమ్ముడూ.. ఇరగదీశావ్‌‌‌‌‌‌‌‌’ అన్నారు. ఆ మాట చాలా హ్యాపీ అనిపించింది. మూడేళ్ల తర్వాత సినిమా తీస్తున్న పవన్‌‌‌‌‌‌‌‌కల్యాణ్‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైలాగ్‌‌‌‌‌‌‌‌ రైటర్స్‌‌‌‌‌‌‌‌ను కాకుండా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా అనిపించింది. 

సినీ రంగంలోకి రాకపోతే ఏమయ్యేవారు?

వ్యవసాయం చేయడమంటే చాలా ఇష్టం. ఎప్పటి కైనా రైతుగా సెటిల్‌‌‌‌‌‌‌‌ అవుతా. ఈ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా వ్యవసాయం వైపు వెళ్లేవాడ్ని. ఈ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక చాలు అనుకున్న తర్వాత ఎక్కడో ఒకదగ్గర భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటా.

ఆడవాళ్ల గురించి రాసిన డైలాగ్స్‌‌‌‌ బాగా ఫేమస్‌‌‌‌ అయ్యాయి కదా? 

అవన్నీ నా మనసులోని భావాలే. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు చూసి చలించిపోయాను. 20వ శతాబ్దంలో ఉన్నప్పటికీ...  స్త్రీల పట్ల ఆలోచనల్లో ఏ మాత్రం మార్పు లేదు. సినిమాలోని సీన్లు కూడా అవే. అందుకే డైలాగులు అంత బలంగా రాయగలిగాను. నిర్భయ ఉదంతం జరిగింది.. చట్టం వచ్చింది కానీ, పరిస్థితులు మారలేదు. దిశ ఘటనలో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ చేశారు. అయినా మార్పు రాలేదు. 9 నెలల పాపపైన అత్యాచారం. ఇలాంటివి చాలా బాధ కలిగించాయి. ఆడవాళ్ల శక్తిని తక్కువగా చూడకూడదని చెప్పేందుకు అలాంటి డైలాగులు రాశాను. ఏదైనా సంఘటన జరిగినప్పుడు నా భావాలు, ఫీలింగ్స్‌‌‌‌ అన్నీ ఒక బుక్‌‌‌‌లో రాసుకునేవాడ్ని. అలా రాసుకున్నవన్నీ ఏరి ఈ సినిమాలో డైలాగ్స్‌‌‌‌లా పెట్టాను. అందుకే, ఆడవాళ్లకు బాగా కనెక్ట్‌‌‌‌ అయ్యాయి.

ఏం చదువుకున్నారు? 

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జయ్యారం మా ఊరు. నాన్న ఒకపక్క వ్యవసాయం చేస్తూనే మరోపక్క సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నేను చిన్నవాడిని. ఒకటో తరగతి నుంచి ఏడు వరకు మా ఊళ్లోనే చదివా. తర్వాత చదువంతా కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోనే. పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్‌‌‌‌‌‌‌‌లో చేరా. కానీ, కొన్ని కారణాల వల్ల పరీక్షలు రాయలేదు. తర్వాత డిగ్రీ ఓపెన్‌‌‌‌గా కట్టా. అది పూర్తికాక ముందే 2000 సంవత్సరంలో హైదరాబాద్‌‌‌‌ వచ్చా. సొసైటీకి ఏదైనా మంచి విషయం చెప్పాలంటే సినిమాల వల్లే సాధ్యం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ ఫీల్డ్‌‌‌‌లోకొచ్చా.  

మీ లవ్‌‌‌‌స్టోరీ చాలా స్పెషల్‌‌‌‌ అంటారు! 

అబ్బో! అది చాలా పెద్ద స్టోరీ లెండి (నవ్వుతూ). సింపుల్‌‌‌‌గా చెప్పేస్తాను. మాది లవ్‌‌‌‌మ్యారేజ్‌‌‌‌. నేను తెలంగాణ, మా ఆవిడ రూపాదేవిది ఆంధ్ర. మా ఇద్దరికి ఫోన్‌‌‌‌లో పరిచయం. చాలాకాలం ఫోన్‌‌‌‌లో మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌‌‌‌ అయ్యాం.పెళ్లికి మూడు రోజుల ముందు ఒకరినొకరం చూసుకున్నాం. వాళ్లింట్లో పెళ్లికి అబ్జెక్షన్‌‌‌‌ చెప్పారు. పెళ్లి చేసుకుని డైరెక్ట్‌‌‌‌గా ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాం. మా ఇంట్లో నేను పెళ్లి చేసుకోవడమే గొప్ప అనుకున్నారు. బ్రహ్మచారిగానే మిగిలిపోతానని అనుకున్నారు. అందుకే, పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ‘ఓకే’ అన్నారు. ఇప్పుడు మా పాపకు ఐదేళ్లు. పేరు కైవల్య.

                                                                                                                                                                                                                 ... తేజ తిమ్మిశెట్టి